Heat Waves : చుక్కలు చూపిస్తున్న సూరీడు.. నడి నెత్తిమీద నాట్యం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Update: 2026-03-08 03:51 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత పెరిగింది. ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఎలినినో ప్రభావంతో దేశం మొత్తం ఉడికిపోతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ అంచనాలకు తగినట్లుగానే మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచి కొడు తున్నాయి. చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ముందుగానే వేసవి తీవ్రత వచ్చిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పగటి వేళ ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో సూర్యుడు చుక్కలు చూపిస్తున్నాడు. పగటి వేళ ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణ కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా కడప, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే మార్కాపురం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వేడిగాలుల తీవత్ర ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అత్యవసరమైతే పగటి వేళ బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
భానుడి ప్రతాపం....
తెలంగాణలోనూ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండల తీవ్రత ఎక్కువయ్యాయి. ఇప్పటికే అనేక చోట్ల నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఖమ్మం, భద్రాద్రికొత్త గూడెం, మంచిర్యాల,ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. రానున్న రోజుల్లోనూ నలభై నుంచి నలబై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు బయటకు రాకపోవడమే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.


Tags:    

Similar News