బోరవెల్లికి 1200 ఏళ్ల చరిత్ర

చారిత్రక ఆనవాళ్లను కాపాడాలని పిలుపు పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి వ్యాఖ్య

Update: 2026-03-07 12:16 GMT

మానోపాడు: మానోపాడు మండల కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న బోరవెల్లి గ్రామంలో కనిపిస్తున్న చారిత్రక ఆనవాళ్లను కాపాడాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. స్థానిక సర్పంచ్ హరిచంద్రా రెడ్డి ఇచ్చిన సమాచారంతో ఆయన శనివారం గ్రామాన్ని సందర్శించి పలు శిల్పాలను పరిశీలించారు.

బురుజు దగ్గర ఉన్న బాదామి చాళుక్యుల కాలం (సా.శ. 8వ శతాబ్దం) నాటి చండి, చాముండి విగ్రహాలు, అదే ప్రాంతంలో కనిపించిన కందూరు చోళుల కాలం (సా.శ. 12వ శతాబ్దం) గణపతి విగ్రహం ఆయన పరిశీలించారు. అలాగే వీరభద్రాలయం పక్కన ఉన్న కళ్యాణ చాళుక్యుల కాలం (సా.శ. 12వ శతాబ్దం) నాగదేవత శిల్పాలు, మరో బురుజు పక్కన ఉన్న కాకతీయుల కాలం (సా.శ. 13వ శతాబ్దం) వీరుల శిల్పాలు (వీరగల్లులు) కూడా చూశారు. ఈ శిల్పాల చారిత్రక ప్రాధాన్యాన్ని గ్రామస్తులకు వివరించారు.

తర్వాత సర్పంచ్ సూచనతో గ్రామ మధ్యలో ఉన్న చెన్నకేశవాలయాన్ని కూడా పరిశీలించారు. బోరవెల్లి సంస్థానం వారు సా.శ. 17వ శతాబ్దంలో విజయనగర వాస్తు శైలిలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలిపారు. గర్భాలయం, అర్ధమండపం, మహామండపం, మూడు వైపులా ప్రవేశ మండపాలు ఉన్నాయని చెప్పారు. ఆలయ అధిష్టానం, గోడలు, కప్పులపై విష్ణు దశావతారాలు, నాట్యగత్తెలు, కాళియమర్దన, భైరవుడు, వెంకటేశ్వర స్వామి విగ్రహాలు చెక్కినట్టు తెలిపారు. ఏనుగులు, సింహాలు, యాలి శిల్పాలు కూడా 17వ శతాబ్దపు శిల్పశైలిని చూపిస్తున్నాయని వివరించారు.

వీరభద్రుని గుడికి కొంత దూరంలో ఉన్న దిగుడు బావి, నిజాం నవాబులు నిర్మించిన కోటగోడ, చుట్టూ కందకం, బురుజులు కూడా ఉన్నాయని చెప్పారు. ఇవి అసఫ్ జాహీ వాస్తు శైలిని తెలియజేస్తున్నాయని అన్నారు. అక్కడ కనిపిస్తున్న రెండు ఫిరంగులు అప్పటి రక్షణ వ్యవస్థను గుర్తు చేస్తున్నాయని వివరించారు.




 దాదాపు 1200 సంవత్సరాల చరిత్రను ప్రతిబింబిస్తున్న బోరవెల్లి చారిత్రక ఆనవాళ్లను కాపాడి భవిష్యత్ తరాలకు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సురవరం గిరిధర్ రెడ్డి, అఖిలభారత పాత దేవాలయాల పునరుద్ధరణ ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్కే జైన్, తెలంగాణ ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎండి శ్రీనివాస్ బండతో పాటు బోరవెల్లి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:    

Similar News