Telangana : దావోస్ లో తెలంగాణకు కుదిరిన ఒప్పందాలివే.. ఏర్పాటు కానున్న సంస్థలివే
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో తెలంగాణ కీలక ఒప్పందాలను చేసుకుంది.
దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో తెలంగాణ కీలక ఒప్పందాలను చేసుకుంది. తెలంగాణకు దావోస్ లో పెట్టుబడుల వెల్లువ కలిగింది. అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుని దాదాపు రూ.30 వేల కోట్ల పెట్టుబడి హామీలు పొందింది. వేగంగా ఎదుగుతున్న గ్లోబల్ పెట్టుబడి గమ్యంగా రాష్ట్ర స్థానం మరింత బలపడిందని అధికారులు తెలిపారు. ఈ ఎంవోయూలు, భాగస్వామ్యాలు ‘తెలంగాణ రైజింగ్–2047’ విజన్‌కు అనుగుణంగా భవిష్యత్‌కు సిద్ధమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ఈ విజన్ కొనసాగుతోంది.
ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగాలు...
డిసెంబరు 2025లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అనుసంధానంగా దావోస్ ఫలితాలు వచ్చాయి. ఆ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడి హామీలు లభించాయి. రాష్ట్ర విధానాలు, పాలనా విధానం, వృద్ధి వ్యూహంపై అంతర్జాతీయంగా కొనసాగుతున్న నమ్మకానికి ఇవి నిదర్శనమని ప్రభుత్వం పేర్కొంది.రాష్మి గ్రూప్‌తో రూ.12,500 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఉక్కు తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉందని అంచనా.
ఎంవోయూలు కుదుర్చుకుని...
గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ, ఎనర్జీ సమర్థత కలిగిన స్టీల్ తయారీ వంటి రంగాల్లో అవకాశాలు విస్తరిస్తాయని అధికారులు తెలిపారు.కాలిఫోర్నియాకు చెందిన బ్లేజ్ సంస్థతో మరో ఎంవోయూ కుదిరింది. ఎనర్జీ-ఎఫిషియెంట్ ఏఐ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ పరిష్కారాలపై ఈ భాగస్వామ్యం దృష్టి పెట్టింది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న బ్లేజ్ ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని విస్తరించనుంది. దీంతో ఏఐ, సెమీకండక్టర్లు, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో తెలంగాణ హబ్‌గా మారాలన్న లక్ష్యానికి బలం చేకూరనుంది. స్టార్టప్ రంగంలో దుబాయ్ మల్టీ కమోడిటీస్ సెంటర్‌తో ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ మార్కెట్లకు ప్రవేశం, మెంటార్షిప్, పెట్టుబడి అవకాశాలు తెలంగాణ స్టార్టప్‌లకు లభించనున్నాయి.
అనేక సంస్థలతో...
క్లీన్ ఎనర్జీ విభాగంలో స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ 300 మెగావాట్ల సామర్థ్యంతో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ప్రాజెక్ట్‌పై ఆసక్తి వ్యక్తం చేసింది. ఇది ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ దశలో ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక నెట్-జీరో లక్ష్యాలకు ఇది కీలక అడుగుగా ప్రభుత్వం పేర్కొంది. అమెరికాకు చెందిన సర్గాడ్ సంస్థ రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడితో అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, ఏవియేషన్ ఎంఆర్వో కేంద్రం ఏర్పాటు ఆసక్తి చూపింది. వరంగల్, ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయాలకు అనుసంధానంగా ఈ కేంద్రం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.యూఏఈ ప్రభుత్వం, తెలంగాణ కలిసి భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సహకరించేందుకు అంగీకరించాయి. స్మార్ట్ సిటీ ప్లానింగ్, స్థిరమైన మౌలిక వసతులు, ఫుడ్ సెక్యూరిటీ, గ్రామీణ–వ్యవసాయ అనుసంధానంపై ఈ భాగస్వామ్యం దృష్టి సారిస్తుంది.
ఫ్యూచర్ సిటీలో....
30 వేల ఎకరాల్లో భారతదేశ తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా దీన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో జాయింట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా వచ్చింది.ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఏబీ ఇన్‌బెవ్ తెలంగాణలో ఉన్న తన యూనిట్‌ను విస్తరించేందుకు నిర్ణయించింది. యూనిలీవర్ హైదరాబాద్‌లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసింది. బ్యూటీ-టెక్ రంగంలో లొరియల్ ప్రపంచంలోనే తొలి బ్యూటీ-టెక్ జీసీసీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇది 2026 నవంబరులో ప్రారంభం కానుంది.డావోస్‌లో కుదిరిన ఈ ఒప్పందాలు ఏఐ, స్టీల్, సెమీకండక్టర్లు, క్లీన్ ఎనర్జీ, స్టార్టప్‌లు, సస్టెయినబుల్ అర్బన్ డెవలప్‌మెంట్ వంటి విభాగాల్లో తెలంగాణ బహుముఖ వృద్ధి వ్యూహాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.