Telangana : గుడ్ న్యూస్.. పెన్షన్ ల మొత్తం పెరగున్నాయ్... ఎప్పటి నుంచి అంటే?
త్వరలో తెలంగాణలో ప్రజలకు తీపికబురు అందునుంది.
త్వరలో తెలంగాణలో ప్రజలకు తీపికబురు అందునుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమయింది. త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని అంటున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పింఛనుదారులకు అవసరమైన మొత్తాన్ని పెంచుతూ త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశముందని తెలిసింది. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉండటంతో పాటు హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఎన్నికలు కూడా వస్తుండటంతో పింఛను మొత్తాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో దీనిపై మంత్రులు కొందరు ప్రస్తావించగడా అందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు తెలిసింది.
ఇప్పటి వరకూ పెంచకపోవడంతో...
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛను మొత్తాన్ని పెంచకపోవడంపై కూడా జనంలో కూడా పెద్దగా చర్చ జరుగుతుంది. విపక్షాలు కూడా దీనిపై విమర్శలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతవులు, వికలాంగులకు నాలుగు వేల రూపాయలు నెలకు పింఛను పెంచుతామని ఆరు గ్యారంటీల్లో ఒకటి. అయితే ఖజానా సహకరించని కారణంగా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. దీనివల్ల దాదాపు 2,500 కోట్ల ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 2,015 రూపాయలు పింఛను ఇస్తుంది. వికలాంగులకు నాలుగు వేల రూపాయలు చెల్లిస్తుంది. అయితే దశల వారీగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
దశల వారీగా...
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వృద్ధాప్య పింఛన్లు నెలకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చెల్లిస్తుంది. పొరుగు రాష్ట్రంలో ఆ రకమైన పింఛను మొత్తాన్ని అమలు చేస్తుండటంతో తెలంగాణలో కూడా అమలు చేయకపోతే తమకు ఎన్నికల్లో రాజకీయంగా నష్టం తప్పదని భావించిన రేవంత్ సర్కార్ ఆ దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిసింది. ఈ ఏడాది ఐదు వందల రూపాయలు పెంచితే కొంత జనంలో నెలకొన్న అసంతృప్తి తొలగిపోతుందని భావిస్తున్నారు. అసలు ఇంకా మూడేళ్లో.. నాలుగేళ్లో పదవీ కాలం ఉంటుందని భావిస్తున్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే 2029లో తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. ముఖ్యమంత్రి కూడా అందుకే అదే అభిప్రాయంలో ఉన్నారు. అందుకే ఎన్నికల నాటికి ఇచ్చిన హామీని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు.