Telangana : మంత్రి పదవులు భర్తీ ఇప్పట్లో లేనట్లేనా? హైకమాండ్ అదే చెప్పిందా?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది

Update: 2026-02-26 12:51 GMT

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది. అయితే ఇప్పటికీ ఇంకా మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండటంతో అందులో మూడింటిని అంతకు ముందు భర్తీ చేశారు. తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మహ్మద్ అజారుద్దీన్ కేబినెట్ లో కి తీసుకున్నారు. మరో రెండు మంత్రి పదవులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. కానీ హైకమాండ్ మాత్రం మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ఇప్పటి వరకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన తర్వాత పార్టీ అగ్రనేతలతో రాష్ట్ర నేతలు భేటీ అయిన సందర్భంగా కూడా మంత్రి వర్గంలో ఖాళీగా ఉన్న పదవుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.

ఆశావహుల సంఖ్య...
మరొకవైపు మంత్రిపదవులు కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. సామాజిక కోణంలోనూ, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా తమకు అవకాశం లభిస్తుందని చాలా మంది భావించారు. కానీ ఊహించని వారికి పదవులు లభించడంతో ఇంకా పదవులపై మాత్రం ఆశలు వదులుకోవడం లేదు. మరొకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తనకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తాము పిలిచి మాట్లాడతామని మాత్రమే చెప్పారు కానీ విస్తరణ విషయాన్ని మాత్రం తేల్చలేదు.
రెడ్డి నేతల నుంచి పోటీ...
ఎస్సీ మాల సామాజికవర్గం నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, కరీంనగర్ జిల్లాకు చెందిన మాదిగ సామాజికవర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్, బీసీ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరిలను మాత్రమే మంత్రిపదవులకు ఎంపిక చేసింది. అసంతృప్తులను ఆ సమయంలో ఇంటికి వెళ్లి బుజ్జగించి కొంత నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ లు సీనియర్ నేతలు సుదర్శన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు భరోసా ఇచ్చారు. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి కూడా తనకు మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. అందరూ రెడ్డి సామాజికవర్గం నేతలు ఎక్కువగా పోటీ పడుతుండటంతో ప్రస్తుతానికి మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని చెబుతున్నారు. అన్నీ సద్దుమణిగాక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. బహుశ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News