Telangana : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. అత్యధిక స్థానాలు ఎవరికంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ విడులయ్యాయి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఐదు గంటల వరకూ క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు పోలింగ్ ను నిర్వహించారు. అయితే అక్కడక్కడ స్వల్ప సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ నెల 13వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 136 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 16వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్,మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక జరుగుతుంది. అలాగే మున్సిపల్ ఛైర్మన్,వైస్ ఛైర్మన్ ఎన్నికను కూడా నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అత్యధిక స్థానాల్లో...
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవనున్నట్లు పలు సర్వేలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించినట్లు తేలింది.ఈ రోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ దాదాపు 70 శాతం మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను కైవసం చేసుకోనున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది.మంచిర్యాల, రామగుండం, నల్లగొండ, మహబుబ్ నగర్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ జోరు కనిపించిందని తెలిపింది. కరీంనగర్, నిజమాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు. ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని పీపుల్స్ పల్స్ తేల్చింది. నిజమాబాద్, కరీంనగర్, మహబుబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం కింగ్ మేకర్ కానుందని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడయింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేవని పీపుల్స్ పల్స్ తేల్చిచెప్పింది.
ఈ మున్సిపాలిటీల్లో...
రామగుండంలో కాంగ్రెస్ 30-34, బీఆర్ఎస్ 16-20, బీజేపీ 3-6, ఇతరులు 4-7 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-9, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28-34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14-16, ఇతరులు 2-4 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. మహబుబ్ నగర్ లో కాంగ్రెస్ 26-30, బీఆర్ఎస్ 18-22, బీజేపీ 6-8, ఎంఐఎం 2-4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తేల్చింది. నల్లగొండలో కాంగ్రెస్ 21-26, బీఆర్ఎస్ 8-12, బీజేపీ 6-10, ఎంఐఎం 2-4, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. నిజమాబాద్ లో కాంగ్రెస్ 10-16, బీఆర్ఎస్ 2-4, బీజేపీ 26-31, ఎంఐఎం 8-12, ఇతరులు 1-2 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది.
కింగ్ మేకర్ గా...
కరీంనగర్ లో కాంగ్రెస్ 14-16, బీఆర్ఎస్ 10-12, బీజేపీ 24-29, ఎంఐఎం 6-9, ఇతరులు 1-3 వార్డులు గెలుపొందే అవకాశం ఉంది. 68-76 మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోనుంది. 29-36 మున్సిపాలిటీలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, 3-5 బీజేపీ, 0-1 ఎంఐఎం గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ తేల్చిచెప్పింది. 8-14 మున్సిపాలిటీల్లో ‘నువ్వా నేనా?’ అన్నట్టు పోటీ ఉందని చెప్పింది. 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 1210-1290, బీఆర్ఎస్ 860-930, బీజేపీ 250-270, ఏఐఎంఐఎం 35-44, సీపీఐ 12-17, సీపీఎం 10-14, ఇతరులు 90-110 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది