Telangana : యాష్కీకి ఇక పదవులు లభించడం కష్టమేనా?

మధుయాష్కీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యున్నత పదవి లభిస్తుందని భావించారు

Update: 2026-04-08 12:51 GMT

మధుయాష్కీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అత్యున్నత పదవి లభిస్తుందని భావించారు. కానీ భవిష్యత్ లోనూ ఎలాంటి పదవి వచ్చే అవకాశం లేదని స్పష్టమయింది. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. మధుయాష్కి 2004, 2009లో నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో తనకు నిజామాబాద్ ఎంపీ సీటు వద్దని ఎల్.బి.నగర్ స్థానాన్ని కోరుకున్నారు. అయితే 2023 లో జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండేళ్లవుతున్నా ఆయనకు కాంగ్రెస్ లో ఎలాంటి పదవులు లభించవు. ఇక కనుచూపు మేరలో పదవులు లభించే అవకాశాలు కూడా లేవన్నది ఆయనకు కూడా స్పష్టంగా అర్థమయింది.

అనేక పదవులు ఆశించి...
పీసీసీ అధ్యక్ష పదవి ఆశించి కూడా భంగపడ్డారు. తర్వాత కనీసం ఎమ్మెల్సీ అయినా ఇస్తారేమోనని భావించారు. ఎందుకంటే తాను రాహుల్ గాంధీకి అత్యంత దగ్గర వ్యక్తినని చెప్పుకునే మధు యాష్కీకి ఖచ్చితంగా పదవి లభిస్తుందని ఆయన సన్నిహితులు కూడా అంచనా వేశారు. కానీ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్లుగా తయారైంది యాష్కీ పరిస్థితి. దీంతో ఆయన రాజకీయంగా కొంత కాలంగా యాక్టివ్‌గా లేరు. గతంలో ఓడిపోయిన నేతలకు పదవులు ఇవ్వకూడదనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం ఆయనకు ఇబ్బందిగా మారింది. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గుతుండటంతో ఇక యాష్కీకి పదవులు వచ్చే అవకాశం లేనట్లే.
రానున్న మూడేళ్ల కాలంలో...
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ కు ఇక ఈ మూడేళ్ల కాలంలో ఎటువంటి పదవులు దక్కే అవకాశాలు లేవు. నిజానికి ఇది మధుయాష్కీ గౌడ్ చేసుకున్న స్వయం కృతాపరాధమే. ఆయన నిజామాబాద్ జిల్లాను వదిలి రావడమే చేసిన అతి పెద్ద తప్పు. అక్కడి నుంచి ఎల్.బి.నగర్ కు రావడంతో అక్కడి ప్రజలు ఆదరించలేదు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేయకపోవడం వరకూ కరెక్టే అయినా ఆ జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఉంటే కొంత అనుకూల ఫలితం వచ్చేదని అంటున్నారు. దీంతో ఆయన అప్పటి నుంచి జిల్లా, రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా కనిపించడం లేదు. తిరిగి ఎన్నికలు వచ్చేంత వరకూ మధు యాష్కీ ఇలాగే ఉంటారని అంటున్నారు. మరి యాష్కీ తానొకటి తలిస్తే.. అన్నట్లుగా పరిస్థితి తయారయిందన్న కామెంట్స్ సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మళ్లీ ఎన్నికలు జరిగి ఆయన గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప పదవులు లభించవన్నది పార్టీ వర్గాలే చెబుతున్నాయి.


Tags:    

Similar News