Hyderabad : హై అలెర్ట్... పొంచి ఉన్న తాగు నీటి సంక్షోభం
తెలంగాణలోని నీటి జలాశయాలు దాదాపు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి.
తెలంగాణలోని నీటి జలాశయాలు దాదాపు ఎండిపోయే పరిస్థితికి చేరుకున్నాయి. దీంతో హైదరాబాద్ కు నీటిఎద్దడి సమస్య తలెత్తుతుందన్న అలెర్ట్ ఇప్పటికే అందింది. వేసవి కాలంలో నీటి ఎద్దడి మామూలే. గతలో ఎన్నడూ లేని విధంగా ఎండల తీవ్రత ఈ ఏడాది మార్చి నెల నుంచి ఉండటంతో నీటి సరఫరా జలమండలికి కష్టంగా మారింది. మార్చి మొదటి వారం నుంచే ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుందని చెప్పాలి. మరొకవైపు గతంలో రోజుకు గంట నుంచి రెండు గంటల పాటు వచ్చే నల్లా నీరు ఇప్పుడు అరగంట వచ్చిన తర్వాత సన్నటి ధార వస్తుండటం మంచినీటి ఎద్దడికి ఉదాహరణగా చూడాలి.
నీటిని వృధా చేస్తే జరిమానా...
సాగునీటి సంగతి పక్కన పెడితే తాగు నీటికి కూడా ఈ ఏడాది ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అందుకే నీటివృధాను అరికట్టాలని జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు నగర ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో మే నెలలో కొంత నీటి ఎద్దడి ఉండేది. ఈసారి మార్చి నెల నుంచే ప్రారంభమయింది. నీరు వృధా చేసినా, తాగు నీటితో వాహనాలు శుభ్రంచేసినా జరిమానా విధిస్తామని జలమండలి అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు కూడా జలమండలి అధికారులతో సహకరించాల్సి ఉంది. మరొకవైపు భూగర్భ జలాలు ఎండిపోవడంతో నగరంలో అనేకచోట్ల బోర్టు ఎండిపోయాయి. చుక్క నీరు కూడా బోరు నుంచి రాకపోవడంతో ట్యాంకర్లకు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి దగ్గరగా...
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కేవలం 176.06 టీఎంసీలుమాత్రమే ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులో 43.75 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దాదాపు డెడ్ స్టోరేజీకి ప్రాజెక్టులు చేరుకున్నాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టులో 28.83 టీఎంసీలు, నిజాం సాగర్ లో 9 టీఎంసీలు, జూరాలలో 9.66 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదుల్లో కూడా నీరు లేకపోవడంతో ఇక రానున్నకాలంలో హైదరాబాద్ కు తీవ్రమైన నీటి సంక్షోభం పొంచి ఉందన్న హెచ్చరికలు వినపడుతున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో వానలు పడితేనే ఏమైనా నీరు వచ్చి జలాశయాలకు చేరుతుంది. కానీ ఇప్పుడు ఆసమస్య లేదు. మరొకవైపు వచ్చే ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు కూడా పరిస్థితి తీవ్రతకు మరింత అద్దంపడుతుంది. మొత్తం మీద చుక్కనీటిని వృధా చేయకుండా ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.