తెలంగాణ బాలికకు మోదీ హామీ ఇచ్చారు. నీవు ఏర్పాటు చేయబోయే 25వ గ్రంథాలయం ప్రారంభోత్సవానికి నేను వస్తాను అని ప్రధాని నరేంద్ర మోదీ ఒక తెలంగాణ బాలికకు హామీ ఇచ్చారు.. ఆకర్షణ సతీశ్ అనే ఈ బాలిక ఇప్పటి వరకు వివిధ ప్రాంతాలలో 11 గ్రంథాలయాలు స్థాపించింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్న ఆకర్షణ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ నగరానికి వచ్చినప్పుడు కలిసింది. ఆమె ఇంతవరకు 7,008 పుస్తకాలు సేకరించింది. వాటితోనే 10 గ్రంథాలయాలు తెలంగాణ రాష్ట్రంలో ఒకటి తమిళనాడులో ఏర్పాటు చేసింది.
గ్రంధాలయ ఏర్పాటుపై...
ఆకర్షణ ఆరంభించిన ఈ అద్భుత ఉద్యమం వెనుక గొప్ప మానవత్వం, నేపథ్యం ఉన్నాయి. ఒకసారి కీమోథెరపీ వైద్యం చేయించుకుంటున్న కొందరు చిన్నారులను ఆమె చూసింది. వారంతా కలరింగ్ పుస్తకాలు కావాలని, దాంతో సమయం ఇట్టే గడచిపోతుందని కోరారు. ఇదే ఆకర్షణను ఈ ఉద్యమానికి పురిగొల్పింది. అది కూడా ఆసుపత్రిలో రోగులకు కొవిడ్ సమయంలో తండ్రితో కలసి ఆహారం అందించినప్పుడు జరిగింది. వెంటనే ఆమె తన కాలనీ సంక్షేమ సంఘం సాయం తీసుకుంది. ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి పుస్తకాల కోసం అభ్యర్థించింది. తన అభ్యర్థనకు వచ్చిన స్పందన చూసి ఆమె దిగ్భ్రాంతికి లోనయింది. రెండురోజులలోనే వందలాది పుస్తకాలు వచ్చి పడ్డాయి. వాటిని ఎంఎన్‌జే ఆసుపత్రిలో భద్రపరిచారు. ఇక ఆమె వెనక్కి చూడలేదు. వరసగా సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్, గాయత్రినగర్ అసోసియేషన్ బోరబండలో, బాలనేరస్థుల బాలికల నిలయం , కోయంబత్తూర్ ఇలా స్థాపించుకుంటూ వెళ్లింది. ఆకర్షణ ఆశయానికి ముగ్దుడైన ప్రధాని 25వ గ్రంథాలయాన్ని తానే ప్రారంభిస్తానని హామీ ఇచ్చారు.