Telangana : కల్యాణ మస్తుకి అర్హతలివే.. తులం బంగారం.. లక్ష నగదు ఎవరికో తెలుసా?

తెలంగాణలో కల్యాణమస్తు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది

Update: 2026-04-08 04:40 GMT

తెలంగాణలో కల్యాణమస్తు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ సాధ్యాసాధ్యాలపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంత వరకూ కల్యాణ లక్ష్మి మాత్రం అమలు కాలేదు. షాదీ ముబారక్ ను కూడా గ్రౌండ్ చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారంతో పాటు లక్ష రూపాయల నగదును ఇస్తామని ప్రకటించింది. ఇది తమ గ్యారంటీ అని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన హామీలు అమలు చేస్తున్నా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. దీనికి కారణం నిధుల కొరతే కారణమని చెప్పక తప్పదు.

మంత్రి ప్రకటనతో...
అయితే తాజాగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు త్వరలోనే కల్యాణ లక్ష్మిని అమలు చేస్తామని ప్రకటించారు. అయితే దీనికి ఎవరు అర్హులు? ఎవరికి తులం బంగారం, లక్ష రూపాయల నగదు వస్తుంది? దీనికి డెడ్ లైన్ ఏమైనా ఉందా? లేకపోతే పథకం ప్రకటించిన తర్వాత మాత్రమే వివాహమయిన వారికి అర్హులుగా ఉంటారా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. కల్యాణ లక్ష్మి పథకం పేరును కల్యాణమస్తుగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరసగా పెళ్లిళ్లు సీజన్లు పూర్తవుతున్నాయి. కానీ కల్యాణమస్తు పథకం మాత్రం ఇంత వరకూ అమలుకు నోచుకోలేదు. ఇందుకోసం 1,450 కోట్ల రూపాయలను ఖర్చవుతుందని అధికారులు ప్రాధమికంగా అంచనా వేసినట్లు తెలిసింది. అంటే ఈ సీజన్ లోనే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
విధివిధానాలివే...
ఆరు గ్యారంటీలు అమలు కాలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కల్యాణ మస్తు పథకాన్ని గ్రౌండ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించారని తెలిసింది. ఈ మేరకు నిధులను సమీకరించాలనిఆర్థిక శాఖ అధికారులకు పురమాయించారని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది మాత్రమే పెళ్లయిన జంటలకు మాత్రమే ఈ పథకం వర్తించేలా నిర్ణయం తీసుకునే అవకాశముంది. రెండేళ్ల నుంచి జరిగిన వివాహాలకు కల్యాణమస్తు పథకం వర్తింప చేయాలంటే నిధుల సమీకరణ సాధ్యం కాదు. అందులోనూ తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారికి మాత్రమే కల్యాణ మస్తు పథకం అమలు చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారని చెబుతున్నారు. మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి.






Tags:    

Similar News