Telangana : అర్బన్ ఓటర్లు హస్తానికి జై కొట్టడానికి రీజన్ ఇదేనా?

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది

Update: 2026-02-13 07:05 GMT

తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం దిశగా దూసుకుపోతుంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరిగాయి. ఖచ్చితంగా కొంత పార్టీ గుర్తులు ప్రభావం చూపుతాయని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. తమ పదేళ్ల పాలనకు, ఇప్పటి కాంగ్రెస్ పాలన రెండేళ్లకు పోలికను చూసి ప్రజలు ఓట్లేస్తారని అనుకున్నారు. అలాగే పట్టణ ఓటర్లు ఖచ్చితంగా డబ్బులు, హామీలకు లోను కాకుండా అభివృద్ధి, సంక్షేమం వైపు చూస్తారని కారు పార్టీ గట్టి విశ్వాసంతో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది.

బీఆర్ఎస్ విమర్శలను కూడా...
కానీ ముఖ్యమంత్రి రెడ్డి నాయకత్వాన్ని బలపర్చే విధంగా ప్రజల తీర్పు చెప్పినట్లయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు కాలికి బలపం కట్టుకుని రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో లోపాలను ఎత్తి చూపేందుకే ఎక్కువ ప్రయత్నాలు చేశారు. రైతు భరోసా నిధులు రాలేదని, కల్యాణమస్తు పథకం అమలు కాలేదని, 420 హామీలు అమలుకు నోచుకోలేదని పదే పదే చెప్పారు. కేసీఆర్ పాలనలోనే అత్యధికంగా సంక్షేమం అందిందని చెప్పి ఓటర్ల మనసులను గెలుచుకునేందుకు ప్రయత్నించారు.
సంక్షేమం..అభివృద్ధిని...
అర్బన్ ఓటర్లు ఒక రకంగా హస్తం పార్టీ వైపు చూశారనే చెప్పాలి. అభివృద్ధి, సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు కనిపించింది. ఫోర్త్ సిటీతో పాటు పెట్టుబడులు తేవడంలోనూ కొంత కాంగ్రెస్ ముందంజలో ఉందని భావించారు. ఓవరాల్ గా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత లేదన్నది ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టమయిందనే చెప్పాలి. ప్రభుత్వం తమకు అండగా ఉంటుందని, ముఖ్యంగా తమ సమస్యలను వినిపించుకునే వీలు ఈ పాలనలో దొరుకుతుందని భావించి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. బీఆర్ఎస్ ప్రచారం పెద్దగా ప్రభావం చూపలేదన్నది స్పష్టమమయింది.


Tags:    

Similar News