వివాదాల్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

మా ఉద్యోగులు అందరికీ 60 సంవత్సరాలే రిటైర్మెంట్ వయస్సు. ఆ తర్వాత పంపించి వేస్తారు. మన స్థానిక ప్రజా ప్రతినిధి వయస్సు 80 సంవత్సరాలు.

Update: 2023-05-27 03:14 GMT

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు కరోనా సమయంలో చేసిన పనులకు మంచి గుర్తింపునే తెచ్చుకున్నారు. కరోనా కట్టడికి మంచి కార్యక్రమాలను చేపట్టారని.. ప్రజల ప్రాణాలు కాపాడారని పలువురు ప్రశంసలు కురిపించారు. అయితే ఆ తర్వాత ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వ అధికారి అయి ఉండి కొన్ని పార్టీలపైనా, నాయకులపైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యల పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే హింట్లు ఇస్తూ ఉన్నారని.. బీఆర్ఎస్ పార్టీకి మరింత దగ్గర అయ్యేందుకు ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ గతంలో పలువురు ఆరోపించారు. ఇటీవల కూడా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై పరోక్షంగా విమర్శలు చేశారు.

'మా ఉద్యోగులు అందరికీ 60 సంవత్సరాలే రిటైర్మెంట్ వయస్సు. ఆ తర్వాత పంపించి వేస్తారు. మన స్థానిక ప్రజా ప్రతినిధి వయస్సు 80 సంవత్సరాలు. కొత్తగూడెం నియోజకవర్గానికి ఆయన ఎంతో చేశారు. ఇప్పటికి కూడా ఆయనను కష్టపెట్టడం బాగుండదు. చాలా పెద్దాయన అందుకే ఆయనకు రెస్ట్ ఇద్దాం. ' అని అన్నారు. అలాగే చివరి సారి జరిగిన ఎన్నికల్లో.. ఇవే చివరి ఎన్నికలు, ఇక నేను కష్టపడలేను, ఇదే నా చివరిసారి, ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని ఆయన చెప్పారు. ఆయన అడిగినట్లే మీరంతా అవకాశం ఇచ్చారు. ఇంకోసారి అవకాశం ఇవ్వండి అని మళ్లీ ఈసారి అడుగుతున్నారు. ఇంకెన్ని సార్లు అవకాశం ఇస్తామని శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు. కొత్తగూడెం నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను మెప్పించేలా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యేపై పరోక్షంగా విమర్శలు చేశారు.


Tags:    

Similar News