Telangana : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే పింఛన్ల మొత్తం పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే పింఛన్ల మొత్తాన్ని పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఆరు గ్యారంటీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరసగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళుతుంది. అయితే ఇందులో ప్రధానమైనది చేయూత పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా పింఛను మొత్తాన్ని పెంచలేదు. గత కేసీఆర్ ప్రభుత్వం 2,016 రూపాయలు ఇచ్చిన విధంగానే ఈ ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని పింఛనుదారులకు అందచేస్తుంది. దానిని పెంచాలని గత కొంతకాలంగా అనుకుంటున్నప్పటికీ నిధుల సమస్య ఇబ్బందికరంగా మారింది.
ఇప్పటికే చేయూత ద్వారా...
చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత, గీత కార్మికులకు, బీడీకార్మికులకు 2,016 రూపాయలు పింఛను చెల్లిస్తుంది. దివ్యాంగులకు మాత్రం 4,016 రూపాయలు ఇస్తుంది. గత ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఈ పింఛను మొత్తాన్ని ఆరు వేలకు పెంచుతామని హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో చేయూత పింఛన్‌ను రూ.4 వేలకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. తొలి విడతలో ఐదు వందలు పెంచాలా? లేక వెయ్యి రూపాయలు పెంచాలా? అన్న యోచనలో సర్కార్ ఉంది.
వెయ్యి కోట్లకు పైగానే...
ప్రస్తుతం దాదాపు 44 లక్షల మందికి పింఛన్లను ప్రభుత్వం అందిస్తుంది. ఇందుకు ప్రతి నెల వెయ్యి కోట్లు పైగానే ఖర్చవతుంది. పింఛన్ల మొత్తాన్ని పెంచితే మరింత అదనపు భారం ఖజానాపై పడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే పింఛన్ల మొత్తాన్ని పెంచకపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందేమోనని, భావించి దశలవారీగా పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. మరొక వైపు తెలంగాణలో కొత్తగా రెండు లక్షల మందికి చేయూత పింఛన్లు అందజేస్తామని మంత్రి సీతక్క అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇప్పటికే లక్ష పింఛన్లు మంజూరు చేశామని, తాజా బడ్జెట్‌లో వీటికి భారీగా నిధులు కేటాయించామని తెలపడంతో మరికొద్ది రోజుల్లోనే పింఛన్ల మొత్తన్ని పెంచే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.