BJP : పొత్తుతో ప్రమాదమే.. ప్రయోజనం లేదు.. ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న కమలం
తెలంగాణలో బీజేపీ ఇక ఒంటరిపోరుకే సిద్ధమవుతుంది
తెలంగాణలో బీజేపీ ఇక ఒంటరిపోరుకే సిద్ధమవుతుంది. ఎటువంటి పొత్తులకు సిద్ధపడకూడదని నిర్ణయించినట్లు కనపడుతుంది. రానున్న కాలంలో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు బహిరంగంగానే ఖండించారు. ఆ పొత్తు వల్ల ప్రమాదమే కాని... ప్రయోజనం లేదని తెలంగాణ బీజేపీ నేతలు ఫిక్స్ అయినట్లుంది. మొన్నటి మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ప్రచారానికి రావాలని ఆహ్వానించిన నేతలు తర్వాత మాత్రం ఆ ఆలోచనను విరమించుకున్నారు.
ఆంధ్ర పార్టీలుగా...
తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని ప్రకటించారు. దీని వెనకకూడా అదే కారణమని అంటున్నారు. టీడీపీ, జనసేనలకు ఆంధ్రాపార్టీలుగా ముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులో ఉన్నాయి. అయితే తెలంగాణకు వచ్చే సరికి ఆ పొత్తు పనిచేయదు. కూటమి వికటిస్తుంది. సెంటిమెంట్ అంటుకుంటే అసలుకే మోసం వస్తుంది. అందుకే ఏఎన్నికల్లోనూ టీడీపీ, జనసేనలతో నేరుగా పొత్తు పెట్టుకోకూడదని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇదే అభిప్రాయం కేంద్ర నాయకత్వంలోనూ ఉంది.
ఒంటరిగానే ఎదగాలని...
తెలంగాణలో బీజేపీ ఒంటరిగా ఎదుగుతుంది. ఇప్పటికే గతం కంటే బలంగా తయారయింది. అలాంటి సమయంలో అనవసరపు పొత్తులకు వెళ్లి పార్టీని ప్రజల్లో పలుచన చేయకూడదని భావిస్తున్నారు. ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇదే సూత్రాన్ని పాటించాలని రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వానికి తెలియజెప్పిందని, అందుకు హైకమాండ్ కూడా అంగీకరించిందంటున్నారు. మరొకవైపు టీడీపీ, జనసేన ఓటు బ్యాంకు తమకు టర్న్ అయ్యే అవకాశం కూడా లేదని, పొత్తు పెట్టుకుంటే ఆ ఓట్లు పడకపోగా, పడే ఓట్లు కూడా రావన్నది పార్టీ నేతల అంచనాగా ఉంది.