Summer Effect : ఏప్రిల్ లోనే రోహిణి కార్తె వచ్చినట్లుందిగా?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

Update: 2026-04-10 04:31 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. అస్సలు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతం కంటే ఈసారి అత్యధికంగా నాలుగు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బ తగిలే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

మే నెలలో ఇంకా ఎంతగానో?
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మే నెలలో ఇంకా ఎలా ఉంటుందన్నది ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అమరావతి వాతావరణ శాఖ అధికారుల అంచనా మేరకు ఇప్పటికే నలభై ఒక్క డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటి నమోదవుతున్నాయి. పగటి వేళ తీవ్రమైన ఎండలు, సాయంత్రమయితే వానలతో భిన్న వాతావరణం నెలకొని ఉంది. మరొక వైపు ఉక్కపోత, సెగగాలులతో జనం సతమతమవుతున్నారు. పల్నాడు, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్...
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఎండలు మండిపోతుండగా మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడుతున్నాయి. రాబోయే మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింతగా పేరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్రమంగా రెండు, మూడు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఇవాళ ఉదయం 8.30 గంటల వరకు భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలో ఇరవై జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇరవై జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న రోజుల్లో మరో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


Tags:    

Similar News