Telangana : కోమటిరెడ్డి అంశం చర్చకు రాలేదట
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు
తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. ప్రధానంగా వరంగల్ జిల్లా సమస్య కొలిక్కి వచ్చిందన్నారు. అక్కడ కొండా మురళి, ఎమ్మెల్యేలకు మధ్య ఏర్పడిన గ్యాప్ తొలిగిపోయినట్లేనని అన్నారు. అందరూ కలసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని నిర్ణయించామని తెలిపారు. వరంగల్ కాంగ్రెస్ లో తలెత్తిన సమస్య తొలిగిపోయినట్లేనని అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చించామని, ఆయన వివరణతో అది కూడా సమసి పోయిందని మల్లు రవి తెలిపారు.
కొండా ఏమన్నారంటే?
ఇక కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తమ దృష్టికి రాలేదని, ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. ఎవరైనా తమ దృష్టికి తీసుకు వస్తే దానిపై చర్చించడం జరుగుతుందని మల్లు రవి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరోవైపు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మరోసారి విచారణ కమిటీ ఎదుటకు హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా అందరం కలసి పనిచేస్తామని చెప్పారు.రాహుల్ గాంధీని ప్రధాని గా చేయడమే తమ లక్ష్మమన్న మురళి క్రమశిక్షణ కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చామని తెలిపారు.