Revanth Reddy : భారీవర్షాలు.. ఆ రహదారులు మూసేయండి
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావరణ శాఖ సమాచారం మేరకు జగిత్యాల తప్పించి మిగిలిన పదిహేను జిల్లాల్లో అధిక వర్షపాతం, మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ఉదయం ఉన్నతాధికారులతో మాట్లాడారు.
కాజ్ వేలు, లోలెవెల్ వంతెనలపై...
వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను ముందుగానే మోహరించామని, వారు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. . వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను ముందుగానే సిద్ధంగా ఉంచాలని రేవంత్ ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు వాటి సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలన్నారు.