Telangana: తెలంగాణ ఉద్యోగులకు భారీ ఊరట.. కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినెట్
తెలంగణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు, మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు, మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు ఐదు గంటల పాటు జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా మహిళలు, ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న డీఏకు ఓకే చెప్పింది. ఇక ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని అడుగుతున్నారని, అయితే ఉద్యోగులు ప్రతి ఒక్కరు ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తే, ఏడాది పాటు వాళ్లు జమ చేసిన నగదుకు సమానంగా ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించింది.
ఉద్యోగులకోసం...
ఇందుకోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని కూడా మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. దీనికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్ గా ఉంటారు. ఉద్యోగ సంఘాల నుంచి ట్రస్ట్ లో సభ్యులుగా ఉ:టారు. ఈ ట్రస్ట్ ద్వారానే ఉద్యోగులకు సేవలందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో పాటు గత ప్రభుత్వం బకాయీ పెట్టిన ఏడు వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఉద్యోగుల బిల్లులను దశల వారీగా ప్రతి నెల ఏడు వందల కోట్ల రూపాయలకు తగ్గకుండా క్లయిర్ చేయాలని నిర్ణయించింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులను ఇక విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించింది
మహిళలకోసం...
ఇక మహిళలకు సంబంధించి ప్రమాద బీమా పథకం అమలు చేయడానికి అవసరమైన 38.5 కోట్ల స్త్రీనిధిని కేటాయించాలని నిర్ణయించింది. బీమా కంపెనీలకు ప్రీమా చెల్లించకుండా నేరుగా స్త్రీ నిధి ద్వారా 385 మంది ప్రమాద బాధిత కుటుంబాలకు బీమా పరిహారం అందించాలని కూడా మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. గ్రామీణ రహదారుల నిర్మాణానికి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసకుంది. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, జిల్లా కేంద్రం నుంచి రాజధానికి నాలుగు లేన్ల రహదారినిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆర్ అండ్ బి పరిధిలో 5,190 కిలోమీటర్లు, పంచాయతీరాజ్ పరిధిలో 7,947 కిలో మీటర్ల రోడ్లను అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదించింది.
మెట్రో విస్తరణకు...
ఇందుకు దాదాపు 16,780 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు, 16,414 కోట్లు ఆర్ అండ్ బి రోడ్లకు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ నిధులతోనే రహదారులను అభివృద్ధిచేసే దిశగా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రైతులకు మరింత ప్రోత్సాహాన్ని అందించేందుకు సన్న వడ్లకు బోనస్ కొనసాగించాలని కూడా మంత్రి వర్గం అభిప్రాయపడింది. ఇక మెట్రో రెండో దశ విస్తరణపైన కూడా కేబినెట్ లో విస్తృతం చర్చ జరిగింది. మొత్తం 86.1 కిలోమీటర్ల రైల్వే నిర్మాణాన్ని చేపట్టాలని కూడా మంత్రివర్గంలో చర్చించారు. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 19,559 కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించింది.