Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యం.. కాంగ్రెస్ సిద్ధంగా ఉందా?
మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది
మున్సిపల్ ఎన్నికల తర్వాత ఉప ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యంగా కనిపిస్తుంది. అయితే ఒక నియోజకవర్గంలో జరుగుతాయా? లేక రెండు నియోజకవర్గాల్లో జరుగుతాయా? అన్నది స్పీకర్ నిర్ణయం పై తేలనుంది. పార్టీ మారిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో పది మందిని విచారించిన స్పీకర్ ఎనిమిది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. మరో ఇద్దరు నేతల విషయంలో మాత్రమే విచారణ పెండింగ్ లో ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలను విచారించారు.
మున్సిపల్ ఎన్నికల కారణంగా...
అయితే మున్సిపల్ ఎన్నికల కారణంగా దానం నాగేందర్ విచారణను వాయిదా వేశారు. కడియం శ్రీహరి విషయంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును స్పీకర్ తరుపున న్యాయవాదులు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నందున విచారణకు కొంత సమయం కావాలనికోరారు. దీంతో మరో మూడు వారాలు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. ఈసారి మాత్రం కోర్టు థిక్కరణ కింద కేసును ఎదుర్కొనాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలే చేసింది. అంటే ఆ గడువు ఈ నెల మూడోవారానికి పూర్తవ్వచ్చు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున్నాయి. దీంతో ఆ తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశముందని తెలిసింది.
పార్టీ మారినట్లు...
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మారినట్లు ఎలాంటి సాంకేతిక ఆధారాలు లేవు. అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం పార్టీ మారినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. 2023 శాసనసభ ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ 2024 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశాలున్నాయి. దానం నాగేందర్ తో పాటు కాంగ్రెస్ కూడా ఇందుకు సిద్ధంగా ఉంది. 2023 ఎన్నికల తర్వాత వరసగా హైదరాబాద్ నగరంలో కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి స్పీకర్ నిర్ణయం తర్వాత ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.