SLBC Accident : నేటి నుంచి గాలింపు చర్యలు ముమ్మరం.. రెస్క్యూ ఆపరేషన్ మరింత వేగవంతం

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్ద చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి

Update: 2025-02-27 03:56 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ వద్ద చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కార్మికులు చిక్కుకుని ఇప్పటికే ఆరో రోజుకు చేరుకోవడంతో ఇక వారు బతికుంటారన్న ఆశలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, నేవీ, ర్యాట్ మేకర్స్ తో పాటు భారత సైన్యం కూడా రంగంలోకి దిగినా ప్రయోజనం కనిపించడం లేదు. అస్సలు లోపలకి అడుగు పెట్టాలంటేనే సాధ్యం కావడం లేదు. ఆరు రోజుల నుంచి ఇంత వరకూ కార్మికుల వద్దకు సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు చేరుకోలేదంటే టన్నెల్ లోపల పరిస్థితి ఎంతగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అధునాతన పద్థతులతో...
ఎస్.ఎల్.బి.సి టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ అనేక అధునాతన పద్ధతులు అవలంబిస్తున్నా వారి జాడ తెలియడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ కు ప్రతికూల పరిస్థితులు కష్టంగా మారుతున్నాయి. టీబీఎం చివరి 40 మీటర్ల దగ్గర పెద్ద ఎత్తున మిషన్ శిథిలాలు పడి ఉండటంతో పాటు మూడు మీటర్ల మేర బురద, నీరు నిలిచిపోయింది. ఇంకా నీరు ఉబికి వస్తుండటంతో లోపలకి వెళ్లిన సహాయక బృందాలు వెనక్కు తిరిగి వస్తున్నాయి. టీబీఎం ను కదిలిస్తే కూలిపోతుందని, పై కప్పు మరీ డేంజర్ గా ఉండటంతో ఆ ప్రయత్నం మాత్రం సహాయక బృందాలు చేపట్టడం లేదు. లోపలికి ఆక్సిజన్ ను పంప్ చేస్తున్నారు. ఆహారపదార్థాలను కూడా లోపలికి పంపుతున్నా వారికి అందుతున్నాయో లేదో తెలియడం లేదు.
మట్టి పడిపోవడంతో...
టన్నెల్ చివరి భాగంలో ఆరు నుండి ఏడు మీటర్ల ఎత్తు వరకు రాళ్లు, మట్టి పడిపోయినట్టు రెస్క్యూ టీం చెబుతుంది. టీబీఎం మిషన్ కింది భాగంలో ఊబిలాంటి ప్రదేశం ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. రూఫ్ టాప్ తక్కువ ఎత్తులో ఉండడం వల్ల ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని సహాయక బృందాలు చెబుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ లో పదకొండు స్పెషల్ టీంలు, 600 మంది అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారు. ఈరోజు నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. డీ వాటరింగ్ తో కొంత బురద, నీరు తగ్గడంతో ఈరోజు కార్మికుల జాడ తెలిసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Tags:    

Similar News