Telangana : నేటి నుంచి భూభారతిపై రెవెన్యూ సదస్సులు
రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు.
తెలంగాణలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమలులోకి రానుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. భూభారతి చట్టాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఏప్రిల్ 14వ తేదీన భూభారతి చట్టాన్ని ప్రారంభించినా జిల్లాకు ఒక మండలం చొప్పున పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు.
అవగాహన కల్పించేందుకు...
అయితే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నారని, అందులో సందేహాలను, అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అన్ని రెవెన్యూ గ్రామాలకు నేటి నుంచి తహసిల్దార్ తో కూడిన బృందాలు గ్రామాలకు వెళ్లి ప్రజలకు భూభారతి చట్టంపై అవగాహన కల్పిస్తారన్నారు. త్వరలో ఈ చట్టాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆరు వేల మంది సర్వేయర్లను నియమించనున్నట్లు మంత్రి తెలిపారు.