Revanth Reddy : పదేళ్లలో ఏం చేశారో చెప్పండి
తెలంగాణలో పదేళ్లు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
తెలంగాణలో పదేళ్లు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చొప్పదండిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే అనేక హామీలను అమలు చేశామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ ది ఫెవికాల్ బంధమని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో అవయవదానం చేసినట్లు బీఆర్ఎస్ బీజేపీకి సీట్లను దానం చేసిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఉచిత విద్యుత్తు, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్లు, పేదలందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఎనిమిది లక్షల కోట్లు చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారని అన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక...
అధికారంలోకి వచ్చిన తమకు చిల్లిగవ్వ కూడా పుట్టకుండా రాష్ట్రాన్ని అప్పులమయం చేసి వెళ్లారని, వారి ఆస్తులను మాత్రం పెంచుకున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లలో మీరు ఫామ్ హౌస్ కే ఎక్కువ కాలం పరిమితమయ్యారని చెప్పుకొచ్చారు. వరి వేస్తే ఉరి తప్పదని చెప్పిన కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో మాత్రం వరి పంట పండించారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వరస నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ నేతలు కూడా గత పదకొండేళ్ల నుంచి తెలంగాణకు ఇచ్చింది ఏమీ లేదని, గాడిద గుడ్డు అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.