SLBC Accident : నలభై ఐదు రోజులకు చేరుకున్నా ఫలితం శూన్యమేనా?

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు కొనాసాగుతున్నాయి

Update: 2025-04-10 04:00 GMT

శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో సహాయక చర్యలు కొనాసాగుతున్నాయి. ఈరోజుకు సహాయక చర్యలు నలభై ఐదో రోజుకు చేరాయి. మృతి చెంది ఉంటారని భావిస్తున్న ఆరుగురి కోసం సహాయక బృందాలు తీవ్రంగానే ప్రయత్నాలు జరుపుతున్నాయి. ఎంతగా వెతుకులాడినా మృతదేహాల జాడ మాత్రం దొరకడం లేదు. దాదాపు నెలన్నర నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నా పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ కేవలం ఎనిమిది మందికి గాను రెండు మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

ఎన్ని రోజులనేది...?
అయితే ఎన్ని రోజులు కొనసాగించాలన్న దానిపై కూడా సహాయక బృందాలకు గైడెన్స్ అందడం లేదు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన పరిస్థితుల్లో ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అవశేషాలు దొరికినా చాలు అని తప్పిపోయిన వారి కార్మిక కుటుంబాలు కోరుకుంటున్నాయి. ఇప్పటికే మృతి చెందిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. భారతీయ ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, నేవీ తో పాటు సింగరేణి కార్మికులు ఇలా మొత్తం పన్నెండు బృందాలు నిరంతరం శ్రమిస్తున్న ఫలితం కనిపించడం లేదు.
కన్వేయర్ బెల్ట్ పూర్తికావడంతో...
మరొక వైపు ఈ సహాయక చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. సహాయక బృందాలను సమన్వయం చేసుకోవడంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కీలక సమాచారం ఇచ్చి వారి నుంచి ఆదేశాలు అందుకోవడానికి శివశంకర్ నిరంతరం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే కన్వేయర్ బెల్ట్ సిద్ధం కావడంతో ఇక సహాయక చర్యలు వేగవంతమవుతాయని చెబుతున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తయితే మాత్రం బురదను త్వరగా తొలగించి ప్రమాదం జరిగిన ప్రాంతంలో తవ్వకాలు జరిపి మృతదేహాలను వెలికి తీసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.


Tags:    

Similar News