SLBC Accident : ప్రమాదకరమైన జోన్ లో తవ్వకాలు.. నేడు తేల్చనున్న అధికారులు
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది
శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ లో జరిగిన ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నేటికి సహాయక చర్యలు 62వ రోజుకు చేరుకున్నాయి. నేడు ప్రమాదకరమైనజోన్ లో తవ్వకాలు జరపాలా? వద్దా? అన్నదానిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశముంది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి శివశంకర్ నిపుణులతో పాటు సహాయక బృందాలతో సమావేశమై తవ్వకాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ప్రమాదకరమైన జోన్ లో తవ్వకాలు జరిపేందుకు అనుమతి వస్తేనే ఎప్పటి నుంచి జరుపుతారన్న దానిపై క్లారిటీ రానుంది.
తొలగింపు తుది దశకు...
ఇప్పటికే టన్నెల్ లో ఉన్న బురద, మట్టితో పాటు టీబీఎం శకలాలను బయటకు తరలించడం దాదాపు గా పూర్తి కావచ్చింది. 281 మీటర్లలో పేరుకు పోయిన బురద, మట్టి, శకలాలు, బండరాళ్లను సయితం తొలగించారు. టన్నెల్ పై కప్పు నుంచి ఉబికి వస్తున్న నీటిని పంపుల ద్వారా బయటకు పూర్తిగా పంపుతున్నారు. ఇప్పటి వరకూ సొరంగంలో సహాయక బృందాలు మృతదేహాలను వెలికి తీయకపోవడానికి కారణం ఈ ఆటంకాలేనని , వాటిని పూర్తిగా అధిగమిస్తే తవ్వకాలు జరపడం సులువవుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
పనులు ప్రారంభించాలంటే...
అయితే టన్నెల్ లో మృతదేహాలు దొరికితేనే తర్వాత పనులు ప్రారంభించడానికి వీలవుతుంది. ఇప్పటికే రెండో వైపు నుంచి టన్నెల్ లో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విదేశాల నుంచి యంత్రాలను కూడా తెప్పించింది. టీబీఎం మిషన్ కు సంబంధించిన సామాగ్రిని కూడా రప్పించింది. దీనిని ఫిక్స్ చేయడానికి నాలుగు వారాల సమయం పడుతుండటంతో ఈ లోగా మృతదేహాలను వెలికితీసి వారి బంధువులకు అప్పగించాలన్న నిర్ణయంతో ఉన్నతాధికారులున్నారు. ఈ మేరకు సహాయక బృందాలు మాత్రం నిరంతరం అన్వేషణ చేపట్టాయి. డేంజర్ జోన్ లో ఉన్న మృతదేహాలను వెలికి తీయాలంటే 43 మీటర్ల పరిధిలో తవ్వకాలు జరపాల్సి ఉంది.