SlBC Accident : రెస్క్యూ ఆపరేషన్ కు తాత్కాలికంగా నిలుపుదల... తిరిగి ఎప్పుడనేది?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలకు బ్రేక్ పడినట్లు తెలిసింది.
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ లో కొనసాగుతున్న సహాయక చర్యలకు బ్రేక్ పడినట్లు తెలిసింది. తాత్కాలికంగా విరామం ప్రకటించాలని సాంకేతిక కమిటీ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రమాదకరమైన జోన్ లో సహాయక చర్యలు కొనసాగించడం మరింత ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సొరంగంలో మరొక వైపు నుంచి ముందు కెళ్లడం కూడా అసాధ్యంగా భావిస్తున్నారు. ఇది సురక్షితం కాదని భావించి తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లు తెలిసింది. యంత్రాలను కూడా సొరంగం నుంచి వెనక్కు రప్పిస్తున్నారు.
మూడు నెలలు అంటున్నా...
అయితే ఎంత కాలం ఈ విరామాన్ని ప్రకటిస్తారన్నది తెలియరాలేదు. గత అరవై నాలుగు రోజులుగా శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం ఎనిమిది మంది కార్మికులు గల్లంతవ్వగా అందులో ఇద్దరి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మిగిలిన మృతదేహాలను వెలికి తీయాలన్న ప్రభుత్వ ఆదేశాలు కూడా ఆచరణలో అమలుకు సాధ్యం కాకపోవడంతో కొంత కాలం విరామం ప్రకటించాలని నిపుణుల కమిటీ సూచించిందని చెబుతున్నారు.
ప్రమాదకరమని...
అందుతున్న సమాచారం మేరకు మూడు నెలల పాటు సహాయక చర్యలను నిలుపుదల చేయాలని నిర్ణయించినట్లు తెలిసినా ఇంకా అధికారిక సమాచారం అందడం లేదు.ఇప్పటికే డేంజర్ జోన్ లో ఉన్న మృతదేహాలను వెలికి తీయడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చాయి. 43 మీటర్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా గుర్తించి షీర్ జోన్ లో తవ్వకాలు జరిపితే మరో ప్రమాదం జరిగే అవకాశముందని భావించి ఎస్.ఎల్.బి.సి టన్నెల్ లో సహాయక చర్యలను నిలుదల చేసినట్లు తెలిసింది. ఈ మేరకు సమావేశమైన నిపుణుల కమిటీ, సాంకేతిక కమిటీ నిర్ణయించినట్లు సమాచారం.