రాజగోపాల్ రెడ్డిది దుర్మార్గం.. నల్గొండ సీనియర్ నేత ఘాటు వ్యాఖ్యలు

Update: 2022-09-03 09:37 GMT

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పొలిటికల్ హీట్ రాజుకుంది. నల్గొండ కాంగ్రెస్‌లో తిరుగులేని వ్యక్తులుగా ఎదిగిన కోమటిరెడ్డి బ్రదర్స్‌ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి దక్కనప్పటి నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్ర అసహనంతోనే పార్టీలో కొనసాగుతున్నారు. నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు ఉన్నప్పటికీ నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో కోమటిరెడ్డి బ్రదర్స్ అటు మీడియా.. ఇటు ప్రజల నోళ్లలో నానుతూ వచ్చారు. తీరా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ నేతలు ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు. తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇప్పటి వరకూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గీయులు కోమటిరెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇంత జరుగుతున్నా జిల్లాలోని సీనియర్ నేతలు కాస్త సంయమనంతోనే వ్యవహరించారు. ఉప ఎన్నిక హీట్ రాజుకోవడంతో సీనియర్లు సైతం నోటికి పనిచెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డి టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈరోజు మునుగోడులో కాంగ్రెస్ చార్జిషీట్ కార్యక్రమం సందర్భంగా టీపీసీసీ మాజీ చీఫ్, నల్గొండ ఎంపీ, సీనియర్ నేత ఉత్తమ్ కుమర్ రెడ్డి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీరని ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడం దుర్మార్గమని ఆయన ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని.. అలాంటి పార్టీలో ఆయన చేరారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.   

Tags:    

Similar News