Kolikapudi Srinivasa Rao : కొలికపూడిని కెలుక్కుంటే ఎవరికి నష్టం?

తిరువూరు వివాదంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుదే తప్పని తేల్చింది

Update: 2025-11-10 08:03 GMT

తిరువూరు వివాదంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుదే తప్పని తేల్చింది. ఇది ఊహించని విషయమేమీ కాదు. కొలికపూడికి వివాదమూ కొత్తేమీ కాదు. గతంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. చంద్రబాబు హెచ్చరికలంటే ఆయనను దగ్గర నుంచి చూసిన వారికి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు హెచ్చరికల కంటే రాజకీయ భవిష్యత్ పైనే ఎక్కువగా హిత బోధ చేయడం అలవాటు. అందుకే కొలికపూడి పెద్దగా పట్టించుకోలేదన్న టాక్ కూడా పార్టీలో వినిపిస్తుంది. అయితే క్రమశిక్షణ కమిటీ ఈ వివాదంలో కొలికపూడి శ్రీనివాసరావుదే తప్పని తేల్చినా ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకునే అవకాశాలు ఎంత మాత్రం లేవన్నది వాస్తవం.

ఇంకా మూడేళ్ల సమయం...
శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడేళ్ల సమయం ఉంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై సస్పెన్షన్ వేటు వేయడం వేరు. కానీ కొలికపూడి రూటు వేరు. ఆ సంగతి పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మూడేళ్ల పాటు తలనొప్పులు భరించాల్సి ఉంటుంది. అసెంబ్లీలోనూ, బయటా ఆయన వ్యవహార శైలి మారుతుంది. ఆయనను అడ్డుకునే పరిస్థితి ఎవరూ చేయరు. కొలికపూడి శ్రీనివాసరావును సామాజికవర్గంలో చూడకపోయినా, ఆయన రాజకీయాలను లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి అని తెలుసు. ఆయన టీడీపీలో ప్రతి రోజూ ఏదో ధౌంజడ్ వాలాను పేలుస్తూ వెళతాడు. అసలు విషయాలు పక్కదారి పట్టి కొలికపూడి హైలెట్ అయ్యే అవకాశాలున్నాయి.
సరైన సమయంలో సరైన నిర్ణయమంటే..?
అందుకే చంద్రబాబు నాయుడు సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పడం వెనక కూడా ఇదే కారణం. వచ్చే ఎన్నికల వరకూ ఓపిగ్గా కొలికపూడి శ్రీనివాసరావును భరించడం తప్ప మరో మార్గం చంద్రబాబుకు లేదు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కొలికపూడికి టిక్కెట్ ఇవ్వకపోవచ్చు. ఆ విషయం కొలికపూడికి కూడా అర్థమయి ఉంటుంది. కానీ ఈ మూడేళ్ల పాటు ఆయనపై పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోకుంటేనే ఇద్దరికీ ఉత్తమం అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది. దూకుడా అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటే ఇక కొలికపూడి వేసే సర్జికల్ స్ట్రయిక్స్ ను నిత్యం భరించాల్సి వస్తుంది. అంత సాహసం పార్టీ నాయకత్వం చేయకపోవచ్చు. కాబట్టి కొలికపూడి శ్రీనివాసరావుపై ఇప్పట్లో చర్యలు తీసుకోరన్నది వాస్తవం. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరన్నది కూడా అంతే నిజం. అందుకోసమే చంద్రబాబు బహుశా చంద్రబాబు ఆ డైలాగ్ వాడి ఉంటారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?


Tags:    

Similar News