KCR : కేసీఆర్ మౌనమే ఆయనకు ఓట్లు తెచ్చేపెట్టేటట్లుందిగా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది. కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో మరిన్ని ఓట్లు తెచ్చి పెట్టేవిగా మారనున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి, కడియం శ్రీహరి రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. కడియం శ్రీహరి జాతిపిత వ్యాఖ్యలు మాత్రమే కాకుండా ఇంకా సెంటిమెంట్ తెలంగాణలో నడుస్తుందా? అన్న కామెంట్స్ కూడా కడియానికి ఎదురుదెబ్బ తగిలేలా ఉన్నాయి. కేసీఆర్ నుంచి ఇటువంటి విమర్శలకు ఎలాంటి స్పందన రాకపోవడం కూడా ఆయనకు వచ్చే ఎన్నికల్లో ప్లస్ కానుందన్న అంచనాలు వినపడుతున్నాయి.
రాష్ట్ర సాధనలో...
ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ అని తెలంగాణ ప్రజలు నమ్ముతారు. రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కేసీఆర్ చేసిన ఉద్యమం కారణంగానే దశాబ్దాల నుంచి రాని తెలంగాణ కల సాకారమయిందన్నది ఇప్పటికే జనం విశ్విసిస్తారు. కేసీఆర్ వయసుతో పాటు ఆయన రాష్ట్రం కోసం చేసిన త్యాగాలను కూడా గుర్తుంచుకోకపోతే ఎలా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు అన్ని వర్గాల వారు కేసీఆర్ ను ఈ విషయంలో ఎవరూ తప్పుపట్టరు. కాకుంటే ఆయన పదేళ్ల పాటు ప్రజల్లోకి రాకపోవడం, నాటి ప్రగతి భవన్ కే పరిమితం కావడంతోనే కొంత వ్యతిరేకత వ్యక్తమయిందని అయినా ఎన్ని సీట్లు శాసనసభలో వచ్చాయన్న విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
అన్ని పదవులు ఇచ్చినా...
కడియం శ్రీహరి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినా తర్వాత ఆయనను పార్లమెంటు సభ్యుడిని చేసింది.. ఆ తర్వాత రాజయ్యను తొలగించి తన మంత్రివర్గంలోకి తీసుకుని ఉప ముఖ్యమంత్రి పదవి అప్పగించింది కేసీఆర్ అని మర్చిపోతే ఎలా అని కొందరు కడియంను నిలదీస్తున్నారు. కడియం శ్రీహరి ఎక్కడ అధికారం ఉంటే అటు వెళ్లే నాయకుడని, అందుకే కేసీఆర్ పై ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన నుంచి మౌనమే సమాధానం వస్తుంది. కాలమే అన్నింటికీ జవాబు చెబుతుందన్న భావనలో కేసీఆర్ ఉన్నారని, రేపు అధికారం కోల్పోతే తిరిగి కడియం శ్రీహరి బీఆర్ఎస్ లోకి రావడానికి ఏ మాత్రం వెనుకాడరన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.మొత్తం మీద కడియం శ్రీహరి లాంటి నేతలు కేసీఆర్ పై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని చేస్తే మంచిదన్న హితవు పలుకుతున్నారు.