Klavakuntla Kavitha : కవిత విమర్శలకు కౌంటర్ ఇవ్వకపోతే ఎలా.. బీఆర్ఎస్ లో అంతర్మధనం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు పంటి కింద రాయిలా మారారు

Update: 2026-01-26 13:17 GMT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ కు పంటి కింద రాయిలా మారారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేసే విమర్శలకు కవిత కౌంటర్ ఇస్తున్నట్లు కనపడుతుంది. ముందుగా బీఆర్ఎస్ లో జరిగిన అవినీతిని బయటపెడుతూ కారు పార్టీని ఇరుకునపెట్టేలా ప్రయత్నిస్తున్నారు. ఏ విషయంలోనైనా సరే కవిత తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీ అని ఏ మాత్రం మొహమాటానికి పోవడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక అవినీతి పనులు జరిగాయని సాక్షాత్తూ కవిత చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ నుంచి సరైన సమాధానమే రావడం లేదు. కవితను ఎంతగా పట్టించుకోకుండా వదిలేయాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నప్పటికీ ఆమె చేసే ఆరోపణలు మాత్రం పార్టీని డ్యామేజీ చేస్తున్నాయని చెప్పక తప్పదు.

సింగరేణి కార్మికుల కాంట్రాక్టులు...
తాజాగా సింగరేణి కాంట్రాక్టులపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు కూడా బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాయి. మేఘా అనే తిమింగలాన్ని రక్షించేందుకు బీఆర్ఎస్ చిన్న చేప చుట్టూ టెండర్ల వ్యవహారాన్ని తిప్పుతోందనితెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కార్మికులకు కష్టం వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పట్టించుకోవటం లేదని, పెద్ద కాంట్రాక్టర్ ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం చేస్తోందన్నారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ తప్పులే చేయనట్లు మాట్లాడటం విచిత్రంగా ఉందని కల్వకుంట్ల కవిత అన్నారు. . గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే సృజన్ రెడ్డికి సింగరేణి కాంట్రాక్ట్ లు ఇచ్చారని, అప్పుడు రేవంత్ రెడ్డి బావమరది అని గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ చేసిన విమర్శలకు విలువ లేకుండా పోతుంది.
కవిత లక్ష్యం వారే అయినా...
కవిత లక్ష్యం హరీశ్ రావు, సంతోష్ రావులు కావచ్చు. తన తండ్రి కేసీఆర్ కు రాసిన బహిరంగ లేఖ బయటకు రావడానికి వారే కారణమని భావించడంతో పాటు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంలో వీరి ప్రమేయం ఉందని గట్టిగా నమ్ముతున్న కవిత వారిని వదిలిపెట్టేలా కనిపించడం లేదు. కవిత విమర్శలు ఏ మాత్రం ప్రభావం చూపవని అనుకోవడం తప్పే అవుతుంది. కేసీఆర్ కుమార్తెగా ఆమె బీఆర్ఎస్ చేసే ఆరోపణలపై చాలా ప్రభావం ఉంటుందని నేతలు ఇప్పటికే భయపడిపోతున్నారు. కవితను కంట్రోల్ చేయడానికి కేసీఆర్ ఇప్పటి వరకూ ప్రయత్నం చేయకపోవడంతో ఇక రానున్న మున్సిపల్ ఎన్నికల్లో సయితం బీఆర్ఎస్ కు నష్టం చేకూరుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.




Tags:    

Similar News