Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత ఆలోచన అదేనట.. క్యాడర్ ఇక ఫుల్ హ్యాపీస్
బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు
బీఆర్ఎస్ మాజీ నేత కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బీఆర్ఎస్ తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లుగా కవిత ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మండలి చైర్మన్ ను మరోసారి కలిసి ఎలాగైనా ఎమ్మెల్సీ పదవి రాజీనామా ను ఆమోదించాలని కోరనున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. తనకు గులాబీ పార్టీతో ఇక ఎలాంటి సంబంధం లేదని స్పష్టత ఇచ్చారు. దీంతో ఆమె కొత్త పార్టీపై ఊహాగానాలు ప్రచారానికే పరిమితమయ్యాయి. అంతే తప్ప అధికార ప్రకటన ఇంత వరకూ వెలువడకపోవడంతో ఆమె వెంట ఉన్న వాళ్లు సయితం ఒకింత డీలాలో పడ్డారని చెబుతున్నారు.
తిరిగి చేర్చుకుంటారని...
కల్వకుంట్ల కవితను తిరిగి బీఆర్ఎస్ లో చేర్చుకుంటారన్న ప్రచారం మొన్నటి వరకూ జరిగింది. కేవలం సస్పెండ్ మాత్రమే చేశారు కాబట్టి కేసీఆర్ తిరిగి ఆమెను పార్టీలోకి తీసుకోవడం ఖాయమని అనుకున్నారంతా. కానీ కవిత మాత్రం తనకు, బీఆర్ఎస్ తో సంబంధం లేదని తేల్చి చెప్పడంతో బీఆర్ఎస్ అగ్ర నేతలు కూడా కవిత సస్పెన్షన్ విషయమై ఆలోచించే అవకాశముండకపోవచ్చు. అయితే కల్వకుంట్ల కవిత తదుపరి కార్యాచరణపై మాత్రం ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఆమె కదలిక ఎటు వైపు ఉంటుందన్న దానిపై అనేక మంది ఆసక్తితో రాజకీయంగా చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని కవిత వెంట ఉన్న వారు గట్టిగా భావిస్తున్నారు. అయితే కవిత తర్వలోనే దీనిపై స్పష్టత ఇస్తారని కూడా అంటున్నారు.
జాగృతినే కొనసాగిస్తారా?
కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ స్థాపిస్తారా..? తెలంగాణ జాగృతిని పార్టీగా ప్రకటిస్తారా..? లేక ఇంకొంత కాలం ఇలాగే జాగృతి సంస్థ ద్వారా రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తారా..? అన్నదానిపై రెండు, మూడు రోజుల్లో కవిత స్పష్టత ఇచ్చే అవకాశముంటుందని అంటున్నారు. తెలంగాణ రాష్ట సమితి మాదిరిగానే కొన్నేళ్ల తర్వాత జాగృతిని రాజకీయ పార్టీగా మార్చే ఆలోచనలో కవిత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొత్తపార్టీ స్థాపనపై ఇంకా కవిత స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపించకపోవడంతో ఆమె వెంట ఉన్న వాళ్లు ఒకింత అయోమయంలో ఉన్నట్లు కనిపిస్తుంది. తన తండ్రి కూడా అనేక మంది మేధావులు తెలంగాణ వాదులతో చర్చించి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నాడు టీఆర్ఎస్ ను రాజకీయ పార్టీగా మలిచారని ఈ మధ్య కవిత ఒక సందర్భంలో వ్యాఖ్యలు చేశారని గుర్తు చేస్తున్నారు.
అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని...
తాను కూడా అందరితో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. స్థానిక సంస్థల ఎన్నికలు.. తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వరసగా ఉండటంతో ఒకవేళ పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో అనుకున్నట్లు జరిగితే రెండు మూడు చోట్ల కూడా ఉప ఎన్నికలు వచ్చే అవకాశంకూడా లేకపోలేదు. ఇంకా పార్టీ స్థాపనపై జాప్యం చేస్తే.. వెంట ఉన్నవారు ఎంతకాలం ఇలా జాగృతి సంఘంలో కొనసాగుతారనేది ప్రశ్న కలుగుతుంది. అయితే కల్వకుంట్ల కవిత తన వెంట నడిచే వారికి అన్యాయం చేయరని, జాగృతి సంస్థ ద్వారానే రానున్న అన్ని ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. కల్వకుంట్ల కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి, ప్రచారం చేయడానికి ఇది మంచి అవకాశంగా కూడా భావిస్తున్నారట. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.