Congress : జీవన్ రెడ్డికి బాసటగా ఎవరూ నిలవరా? పెదవి విప్పరా?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఎంతో దగ్గరగా లేదు
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే సమయం ఎంతో దగ్గరగా లేదు. ఆయన గత రెండేళ్ల నుంచి జరుగుతున్న అవమానాలకు ఇక ఫుల్ స్టాప్ పెట్టే పనిలో ఉన్నారని తెలిసింది. జరుగుతున్న పరిణామాలు అన్ని తెలిసినా పీసీసీ చీఫ్ పెదవి విప్పడం లేదు. ఉప ముఖ్యమంత్రి ఉలకరు.. పలకరు. మంత్రులందరూ మౌనం. ఎవరూ కాంగ్రెస్ లో మద్దతు తెలిపే వారే లేరన్నది పెద్దాయనకు స్పష్టమయింది. దీంతో ఆయన క్విట్ అవ్వడమే తనకు శరణ్యం అని భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ఎంత దిగివచ్చి కాంగ్రెస్ కు అనుకూలంగా మారినా నాయకత్వం మాత్రం తనను పట్టించుకోవడం లేదని, తన వర్గాన్ని తనను దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుందని ఆయన బలంగా నమ్ముతున్నారు.
పార్టీని వీడటం మినహా...
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో తాను చెప్పిన వారికి బీఫారాలు ఇవ్వకపోవడంతో వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి గెలిపించుకున్నానని, కానీ గెలిచిన తర్వాత కనీసం ఛైర్మన్ పదవి కూడా ఇవ్వకుండా తనను అవమానించారని జీవన్ రెడ్డి మదనపడుతున్నారు. ఇది తనను అవమానించడమేనని, ఇంకెన్ని అవమానాలు ఇంకా ఎదుర్కొనాలని, అందుకే ఇక పార్టీని వీడటం మినహా తనకు మరొక మార్గం లేదని ఆయన స్పష్టం చేయడం నిజంగా కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇదే భవిష్యత్ లో ఎవరికైనా జరగొచ్చని, అలాంటి సమయంలో ఒకరికొకరు మద్దతు ఇవ్వకపోతే ఎలా? అని జీవన్ రెడ్డి సూటిగానే ప్రశ్నిస్తున్నారు.
అధికారంలో లేనప్పుడు కూడా...
పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలు రేపు అధికారం కోల్పోతే ఉండరు. కానీ జీవన్ రెడ్డి పదేళ్లు అధికారం లేకపోయినా కాంగ్రెస్ లోనే ఉండి జెండాను వదలకుండా పట్టుకున్నందుకు మంచి బహుమతి ఇచ్చారంటూ సోషల్ మీడియాలోనూ ఆయనకు అనుకూలంగా కామెంట్స్ వినపడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా తన నియోజకవర్గం ఎమ్మెల్యేను చేర్చుకోవడమే కాకుండా తనకు ప్రాధాన్యత ఇవ్వని పార్టీలో ఉండటమెందుకన్న ఆయన ప్రశ్నకు లోలోపల సీనియర్ నేతలు నిజమేనని అభిప్రాయపడుతున్నా.. పెదవి విప్పడానికి మాత్రం భయపడుతున్నారంటున్నారు. . తాను రాజీ పడేది లేదని జీవన్ రెడ్డి చెబుతున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందని ఆయన చెప్పడం బట్టి చూస్తుంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి క్విట్ అవ్వడం ఎంతో దూరం లేదనిపిస్తుంది.