Weather Report : వేడి గాలులు మొదలయ్యాయి.. ఇక దబిడి దిబిడే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత పెరిగింది
మూడు నెలలకు పైగా కొనసాగిన శీతాకాలం పూర్తయింది. వేసవి కాలం వచ్చేసింది. చలి గాలుల నుంచి పూర్తిగా తేరుకుని, ఇక వేడి గాలులకు శరీరాలు అలవాటు పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించాయి. రెండు రాష్ట్రాల్లో కనీసంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం, రాత్రి వేళల్లో కొంత చలిగాలులు వీస్తున్నప్పటికీ పగలు మాత్రం భానుడి ప్రతాపంతో ఎండల తీవ్రత ఎక్కువవుతుంది.
ఏపీలో గరిష్ట ఉష్ణోగ్రతలు...
ఆంధ్రప్రదేశ్ లో గరిష్టంగా ఉష్ణోత్రగలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పల్నాడు జిల్లాలో అత్యధికంగా 35 డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరొకవైపు రాయలసీమలో కొంత తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మిగిలిన ప్రాంతం కంటే సీమలోని నాలుగు జిల్లాల్లో కొంత ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి. మరొకవైపు ఈ నెలాఖరున బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు పడే అవకాశముందని తెలిపింది.
తెలంగాణలో పొడి వాతావరణం...
హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ తెలంగాణలోని అన్ని ప్రాంతాలలో స్పష్టమైన ఉష్ణోగ్రతలలో స్థిరమైన పెరుగుదలను సూచించింది. ఇది వేసవి కాలం వచ్చిందనడానికి స్పష్టమైన సంకేతం. ఐఎండీ-హైదరాబాద్ దీర్ఘకాల వాతావరణ సూచన ప్రకారం, వేసవి లాంటి పరిస్థితులకు మారుతుందని, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం, వర్షాలు ఉండవని సూచించింది. గరిష్ట పగటి ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్, 34 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల సెల్సియస్ నుండి 19 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది. ఉదయం వేళల్లో తేలికపాటి పొగమంచు లేదా పొగమంచు ఉండవచ్చు. మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా పొడిగా, ఎండగా ఉంటుందని అంచనా.