Weather Report : సూర్యుడి సిగ్నల్స్ మామూలుగా లేవుగా.. మే నెలలో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి పూర్తిగా తగ్గింది. ఉక్కపోతతో పాటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భారత వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసినట్లు ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది. ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం వేళ కొంత చలి అనిపిస్తున్నప్పటికీ తర్వాత మాత్రం భగభగమండిపోతుంది. పది గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. మాడు పగిలిపోయే ఎండలు కాస్తున్నాయి.
చలి తగ్గినప్పటి నుంచి...
ఆంధ్రప్రదేశ్ లో చలి పూర్తిగా తగ్గిపోయింది. కనిష్టం నుంచి గరిష్టానికి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి రెండో వారంలోనే ఇలా ఉంటే ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎలా ఉంటాయన్నది ఆలోచిస్తేనే చెమటలు పడుతున్నాయి. గత వేసవిలో గరిష్టంగా 48 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది దానిని మించి నమోదయ్యే అవకాశముందన్న అంచనాలు ప్రజలను ఒకరకంగా భయపెడుతున్నాయి.
పొడి వాతావరణం నేడు...
తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఏపీతో పోలిస్తే కొంత తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. తెలంగాణలో గరిష్టంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ కొంత చలిగాలులు వీస్తున్నాయి. అలాగే సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం వేళ అక్కడక్కడ పొగమంచు కురిసే అవకాశముందని తెలిపింది. కొన్ని జిల్లాలు...ఏపీ సరిహద్దు జిల్లాల్లో మాత్రం కొంత వేడి వాతావరణం నెలకొని ఉందని అధికారులు తెలిపారు. అంటే నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.