Weather Report : వచ్చే నెలలో ఎన్ని డిగ్రీల టెంపరేచర్ టచ్ అవుతుందో తెలిస్తే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. పగటి వేళ ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్టానికి చేరుకున్నాయి. కొంచెం తెల్లవారు జామున మాత్రమే చలి కనిపిస్తుంది. మిగిలిన అన్ని వేళల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. వాతావరణ శాఖ అందించిన నివేదికల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రానున్న కాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కొన్నిచోట్ల తేలికపాటి, మరొకొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత మాత్రం మరింత ఎండలు తీవ్రమవుతాయని తెలిపింది.
నేడు ఏపీలో పొడి వాతావరణం...
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూడా పొడి వాతావరణం నెలకొని ఉంటుంది. ఉదయం వేళ దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశముంది. అలాగే పగటి ఉష్ణోగ్రతలు నేడు కూడా 35 డిగ్రీలు నమోదయ్యే అవకాశముందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా మార్చి నెల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎండలు దంచి కొడతాయని అంటున్నారు. ఈసారి ఏపీలో నలభై ఎనిమిది డిగ్రీలు మార్చి, ఏప్రిల్ నెలలోనే టచ్ అవుతాయని అంటున్నారు. ఇక మే నెలలో ఎండల తీవ్రత ఎంతగా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. వర్షాలు పడిన తర్వాత ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని అంటున్నారు.
వానలు - వడగళ్ల వాన...
మరొకవైపు తెలంగాణలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్టు కూడా ఈసారి అధికంగా ఎండల తీవ్రత ఉంటుందని, అయితే ఈ నెలాఖరులో వానలు పడే అవకాశముందని తెలిపారు. నేడు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పింది. హైదరాబాద్ నగరంలోనూ పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి వేళ మాత్రం కనిష్టంగా 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కేవలం వర్షమే కాకుండా, కొన్ని జిల్లాల్లో వడగళ్ల తుపాను కూడా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం వచ్చే వారం వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఫిబ్రవరి 22, 23 మరియు 24 తేదీల్లో తెలంగాణ అంతటా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో 20-40 మి.మీ వరకు మోస్తరు నుండి భారీ వర్షం పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన జిల్లాల్లో వర్షం మరియు వడగళ్ల వాన కురుస్తుందని తెలిపారు.