SlBC Accident : డేంజర్ జోన్ లో తవ్వకాలపై త్వరలోనే నిర్ణయం.. ముగించేయాలనేనా?
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో మృతదేహాలున్న ప్రాంతంలో తవ్వకాలు ఈ నెల 24వ తేదీన మాత్రమే ప్రారంభం కానున్నాయి
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో మృతదేహాలున్న ప్రాంతంలో తవ్వకాలు ఈ నెల 24వ తేదీన మాత్రమే ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకూ టన్నెల్ లో పేరుకుపోయిన బురద, బండరాళ్లను తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా బురద, బండరాళ్లను బయటకు తెస్తున్నారు. అదే సమయంలో టీబీఎం మిషన్ శకలాలను లోకో ట్రెయిన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. గత 59 రోజులుగా జరుగుతున్న సహాయక చర్యలు ఇంకా మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి.
మరో వారం రోజులు...
మృతదేహాలు దొరకడానికి మరో వారం రోజులు సమయం పట్టే అవకాశముందన్న అంచనాలో ఉన్నతాధికారులున్నారు. సొరంగంలో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పినా ఇంకా ప్రమాదం జరిగిన ప్రాంతంలో మాత్రం తవ్వకాలు జరపడం లేదు. అక్కడకు వెళ్లాలంటే ప్రమాదకరమైన పరిస్థితులతో పాటు ఆటంకాలు ఎదురు అవుతుండటంతో అక్కడకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. దీంతో ముందు అక్కడ ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. గత కొన్ని రోజులుగా అదే పనిలో ఉన్నారు.
ఆరుగురి కార్మికుల మృతదేహాలు...
ఆరుగురి కార్మికుల మృతదేహాలు లభ్యమవ్వాలంటే నలభై ఐదో మీటర్ వద్ద ఉన్న డేంజర్ జోన్ లో తవ్వకాలు జరపాల్సిందే. అక్కడ ఇప్పటికే ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి అక్కడ వరకూ వెళ్లకపోయినా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. డేంజర్ జోన్ వద్ద పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు మరో మూడు రోజుల సమయం పడుతుందని, అందుకే ఈ నెల 24వ తేదీన దీనిపై కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. డేంజర్ జోన్ లో తవ్వకాలు ఎలా జరపాలి? ఏరకంగా జరపాలి? అన్న దానిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. నిపుణుల కమిటీ చేసిన సూచనల మేరకు ముందుకు వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. దీంతో 24వ తేదీ తర్వాత మాత్రమే మృతదేహాలున్న చోట తవ్వకాలు ప్రారంభమయ్యే అవకాశముంది.