Telangana : కాంగ్రెస్ లో జగిత్యాల జగడం.. పెద్దాయనపై వేటు తప్పదా?

మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటట్లు కనపడుతుంది

Update: 2026-02-07 12:29 GMT

మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటట్లు కనపడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను రంగంలోకి దించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయించి పెద్దాయన గడప గడపకు తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వానికి దడ మొదలయింది. మున్సిపల్ ఎన్నికల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్గానికి 30 మందికి, జీవన్ రెడ్డికి చెందిన వర్గానికి ఇరవై మందికి బీఫారాలు అందచేసింది. అయితే ఇందుకు జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన సంజీవ్ కుమార్ ను పార్టీలో చేర్చుకున్న నాటి నుంచి ఆయన నిరసనను వివిధ సందర్భాల్లో తెలియజేస్తూనే ఉన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో...
అయినా రాష్ట్ర నాయకత్వం మాత్రం జీవన్ రెడ్డిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జగిత్యాల నియోజకవర్గంలో ఒకరకంగా జీవన్ రెడ్డికి సానుభూతి పెరిగినట్లే కనిపిస్తుంది. ఆయన తన వర్గాన్ని నిలబెట్టుకునేందుకు తన వంతు ప్రయత్నంగా స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దించారు. దీంతో అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు జీవన్ రెడ్డి వర్గం వారు కూడా ఎన్నికల్లో పోటీ పడుతుండటంతో పోటీ తీవ్రంగానే ఉంది. దీంతో కాంగ్రెస్ అధికారిక అభ్యర్థులకు జీవన్ రెడ్డి జ్వరం పట్టుకుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కొందరు జీవన్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో పార్టీ నాయకత్వం జీవన్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
స్వతంత్ర అభ్యర్థులుగా...
అయితే తప్పు చేసింది పార్టీ నాయకత్వం. అక్కడ వేరే పార్టీ నుంచి గెలుపొందిన వారికి అందలమెక్కించి, గత కొన్ని దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన జీవన్ రెడ్డి లాంటి వారికి అన్యాయం జరుగుతుండటాన్ని రాష్ట్రంలోని ప్రతి నేత మనసులో కూడా మదనపడుతున్నారు. కానీ నాయకత్వం మాత్రం జీవన్ రెడ్డి పోకడలను నచ్చడం లేదంటుంది. కానీ పెద్దాయన మాత్రం తన వర్గానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనని అంటున్నారు. మొత్తం మీద జగిత్యాల జగడం కాంగ్రెస్ కు ఫీవర్ తెప్పించినట్లుంది. అయితే చర్యలు తీసుకోవాలా? లేదా? అన్నది నాయకత్వం ఇంకా తేల్చుకోలేదు. కానీ జీవన్ రెడ్డి మాత్రం తన అభ్యర్థులను గెలిపించుకోవడానికి మాత్రం విశ్వప్రయత్నం చేస్తున్నారు. చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.


Tags:    

Similar News