Telangana : తెలంగాణలో వరదొలొస్తే టాలీవుడ్ స్పందించదా?

క్లౌడ్ బరస్ట్ జరిగి తెలంగాణలో అనేక జిల్లాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం బాధితులను ఆదుకునేందుకు ముందుకు రాలేదు

Update: 2025-08-31 11:48 GMT

ప్రకృతి వైపరీత్యాలు చెప్పి రావు. ప్రభుత్వం చేతుల్లో కూడా ఉండవు. తాజాగా క్లౌడ్ బరస్ట్ జరిగి తెలంగాణలో అనేక జిల్లాల్లో తీవ్రమైన నష్టం జరిగింది. వాగులు, వంకలు ఏకమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. చెరువులు అలుగు బారి అనేక పంట పొలాలతో పాటు నివాస ప్రాంతాలను కూడా ముంచి వేశాయి. దాదాపు పది మంది వరకూ ఈ వరదల కారణంగా చనిపోయారని చెబుతున్నారు. నష్టం మాత్రం వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. రైతులు, ప్రజలు ఈ వరద ముప్పు నుంచి కోలుకోవడం ఇప్పట్లో కష్టమే. ఎందుకంటే సంపాదించుకున్నదంతా నీళ్ల పాళ్లయింది.

బాధితులకు అండగా నిలవాల్సిన...
అయితే ఈ సమయంలో బాధితులకు అండగా నిలవాల్సిన చిత్ర పరిశ్రమ ఇంత వరకూ స్పందించకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. తమ జేబులో ఉన్న కాస్తో గొప్పో సొమ్ములు పోగొట్టుకుని సినిమాల్లో కష్టాలు, కామెడీలు చూసి తరించే జనం గోడును మాత్రం ఇప్పటి వరకూ పట్టించుకోలేదు. చిత్ర పరిశ్రమ నుంచి నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ విరాళాలు అందచేయాల్సిన పరిస్థితుల్లో మౌనంగా ఉండటం కూడా విమర్శలకు తావిస్తుంది.
తీవ్ర నష్టం జరిగినా...
సహజంగా జనం సొమ్ముతోనే కోట్లాది రూపాయలు కూడబెట్టుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్న సినీ పరిశ్రమకు చెందిన అగ్ర కథానాయకులు, దర్శకులు, నిర్మాతలు తెలంగాణలో జరిగిన నష్టాన్ని చూసి కనీసం చలించకపోవడం ఏంటన్న ప్రశ్న సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీగా నష్టం సంభవించింది. చేతికి రావాల్సిన పంట అందకుండా పోయింది. అయినా చిత్రపరిశ్రమలో కదలిక లేకపోవం విడ్డూరంగా ఉందన్నవ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా చిత్ర పరిశ్రమ నుంచి వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సాయంచేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News