Chandrababu: మూడేళ్లలో అమరావతి రూపురేఖలే మారనున్నాయి : చంద్రబాబు

ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

Update: 2026-02-14 13:04 GMT

ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.అసెంబ్లీ లాబీలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ చేశారు. . వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయని, ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని తెలిపారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని, సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని చంద్రబాబు అన్నారు. ఒంగోలు పాలకు... అనంతపురం పండుకు బహిరంగ మార్కెట్టులో ఎంతో డిమాండ్ ఉందని, దేశంలోనే ఉత్తమమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని, అక్కడ పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని చంద్రబాబు చెప్పారు. రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని, రాయలసీమ హార్టీకల్చర్ హబ్ కు రూ. 30 వేల కోట్లు కేటాయించడంతో ఎమ్మెల్యేలు అంతా సంతోషంగా ఉన్నారని తెలిపారు. రెండు మూడేళ్ళలో అమరావతికి ఒక రూపు వస్తుందని, అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని, అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమూ వస్తుందని చంద్రబాబు తెలిపారు. పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందని, ఇన్నర్ రింగ్, ఔటర్ రింగ్ వల్ల ఇంకా యాక్సిస్ పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేదని,

నాడు జూబ్లీహిల్స్ లోనూ...
1982లో జూబ్లీహిల్స్ లో ఇప్పుడు బాలకృష్ణ ఉంటున్న ఇంటి స్థలంలో తనకు ఇల్లు కట్టిస్తానని ఎన్టీఆర్ చెప్పారని, అప్పుడు తాను మంత్రిగా ఉండి స్థలం చూస్తానికి వెళ్తే మొత్తం అడవిలా ఉందన్నారు. ఇక్కడికి ఆటోలు కూడా రావని... పెద్దాయనతో సున్నితంగా వద్దని చెప్పానన్న చంద్రబాబు ఆ తర్వాత అక్కడ బాలకృష్ణకు ఇల్లు కట్టించి ఇచ్చారని, నాలుగేళ్లలోనే అక్కడి పరిస్థితులు చాలా మారిపోయాయని తెలిపారు. సినీ హీరోగా బిజీగా ఉంటూ బాలకృష్ణ చెన్నైలో ఉంటే నేను 4ఏళ్లు అదే ఇంటిలో ఉన్నానని, • జూబ్లీహిల్స్ లో అక్కడికి సమీపంలో తన ఇల్లు పూర్తయ్యాక అప్పుడు అక్కడికి మారానని చంద్రబాబు చెప్పారు. అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయ మార్పులే ఉంటాయని, ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారిని వారికి అద్దంలో చూపిస్తున్నానని, ఉమ్మడి రాష్ట్రంలో తొలిసారి సీఎంగా ఉన్న మాదిరిగానే నిక్కచ్చిగా ఉంటానని చెప్పారు. లోకేష్ పని లోకేష్ చేస్తున్నాడని, నా పని నేను చేస్తున్నానని, నేతలతో మానవీయ సంబంధం ఉండాలని, మోటివేషన్ ఉండాలన్నారు. అలాగే భయమూ ఉండాలి భక్తీ ఉండాలని కూడా చంద్రబాబు అన్నారు. తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రీటెక్ కోసం వచ్చారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం బిల్ గేట్స్ ఏపీకి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. దీనికి సంబంధించి ఆర్టీజీ కేంద్రంలో ఓ కార్యక్రమం రూపొందించామన్నారు.


Tags:    

Similar News