Kalvakuntla kavitha : మళ్లీ షాక్ ఇచ్చిన కవిత.. ఈసారి నేరుగా కేటీఆర్ పైనే గురి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది

Update: 2025-05-29 06:12 GMT

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధమయినట్లే కనిపిస్తుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇందుకు అద్దం పడుతున్నాయి. పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ రోజుకొక వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే పార్టీయే తనను బయటకు పంపాలని కవిత వెయిట్ చేస్తుందని అనుకోవాలి. తాజాగా బీజేపీతో బీఆర్ఎస్ ను విలీనం చేయాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినందునే తనపై ఈ రకమైన మాటల దాడి జరుగుతుందని భావించాలి. కేసీఆర్ చేయి దాటి పోయింది. కవిత కూడా డిసైడ్ అయింది. అయితే పార్టీ నుంచి ఎగ్జిట్ ఎలా ఉంటుందన్నదే ఇప్పుడు ప్రశ్న. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని ప్రయత్నిస్తున్నారన్న కల్వకుంట్ల కవిత కామెంట్స్ ను పార్టీ నాయకత్వం కూడా సీరియస్ గా తీసుకునే అవకాశముంది.

లీకు వీరులెవ్వరు?
తాను రాసిన లేఖను ఎవరు బయటపెట్టాలో చెప్పాలంటూ కవిత ప్రశ్నించారు. తనకు వెన్నుపోటు రాకీయాలు తెలియదంటూనే, ముందు ఒకటి వెనక ఒకటి మాట్లాడనని, తాను కూడా కేసీఆర్ లాగా తిక్క ఉందని, ఎవరినీ లెక్క చేయబోనని కల్వకుంట్ల కవిత తెగేసి చెప్పారు. తాను ఒకటి కాదు ఇప్పటికే వందల లేఖలు రాశానని, ఈ లేఖ ఎందుకు బయట పెట్టారంటూ ఆమె ప్రశ్నించారు. తనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు తానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పానని, అందుకు ఆయన అంగీకరించలేదన్నారు. బీఆర్ఎస్ లో తనకు ఒకే ఒక నాయకుడు ఉన్నారని, ఆయనే కేసీఆర్ అంటూ ఆమె మండి పడ్డారు.
బీజేపీలో విలీనం ప్రయత్నాన్ని...
బీజీపీలో విలీనం చేయవద్దని తాను గట్టిగా మాట్లాడితే డబ్బులిచ్చి కొందరితో తనను తిట్టిస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త పార్టీ అవనసరమని, ఉన్న పార్టీని, కేసీఆర్ ను కాపాడుకుంటే సరిపోతుందని అనడంతో తాను పార్టీనే ఉంటూ అసంతృప్తి వెళ్లగక్కుతానని కల్వకుంట్ల కవిత చెప్పకనే చెప్పారు. తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదని కూడా కవిత అన్నారంటే ఆమె పోరాటం నేరుగా కేటీఆర్ పైనే ఉందని అర్థమవుతుంది. లీకువీరులను బయటపెట్టమంటే గ్రీకు వీరుల్లా తనపై పోరాటం చేస్తున్నారన్నారు. తాను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాడానని కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు. స్పష్టంగా ఇది తండ్రి కూతుళ్ల మధ్య వైరం కాదు. అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న యుద్ధమేనని చెప్పాలి.
కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ...
తాను బీఆర్ఎస్ లో ఉంటే బీజేపీలో కలపడం కుదరదని తనను కేసీఆర్ కు దూరం చేస్తున్నారని, 101 శాతం బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతుందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ తో తాను చేరతాననడం అర్ధం లేదని, తాను కాంగ్రెస్ నేతలతో మాట్లాడి పదమూడేళ్లు అయిందని కూడా కవిత చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు వేరుగా ఉన్నాయని, కేవలం ట్వీట్లతో సరిపెడితే చాలదని కవిత కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కేసీఆర్ కు నోటీసులు ఇస్తే ట్వీట్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా? అని కేటీఆర్ ను సూటిగానే ప్రశ్నించారు. కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే కవిత అన్నను టార్గెట్ చేయడం మాత్రం బీఆర్ఎస్ లో కలకలం రేపుతుంది. కారు డ్రైవింగ్ సీటు కోసం ఈ కొట్లాట అని స్పష్టమవుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో కేసీఆర్ నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ నుంచి బయటకు పంపడమా? బుజ్జగించడమా? అన్నది ఇప్పుడు కేసీఆర్ చేతుల్లోనే ఉంది.


Tags:    

Similar News