BJP : రెండు కార్పొరేషన్లలో కాషాయ జెండా ముందంజ

బీజేపీ రెండు కార్పొరేషన్లలో ఆధిక్యతతో కొనసాగుతుంది

Update: 2026-02-13 11:45 GMT

బీజేపీ రెండు కార్పొరేషన్లలో ఆధిక్యతతో కొనసాగుతుంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంది. 60 డివిజన్లకు గాను 33 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. బీజేపీ రెబల్ అభ్యర్థులు కూడా గెలవడంతో ఇక్కడ సునాయాసంగా బీజేపీ విజయం దక్కించుకున్నట్లయింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కార్పొరేషన్ ను బీజేపీ కైవసం చేసుకుంది. కరీంనగర్ కార్పొరేషన్ చరిత్రలో తొలిసారి కాషాయ జెండా రెపరెపలాడనుంది.

అత్యధిక స్థానాల్లో కమలం...
బండి సంజయ్ ఈ కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బండి సంజయ్ కూడా కార్పొరేటర్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన విషయం తెలిసిందే. అందుకే బండి సంజయ్ అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ తానే దగ్గరుండి చూసుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై ప్రచారంలో విమర్శలు చేస్తూ తమను గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి కరీంనగర్ రూపు రేఖలను మారుస్తానని చెప్పారు. ప్రజలు కూడా బండి సంజయ్ కు మద్దతుగా నిలిచారు. దీంతో అత్యధిక స్థానాల్లో బీజేపీ కార్పొరేటర్లుగా గెలవడంతో ఇక్కడ కమలం పార్టీ అభ్యర్థి మేయర్ కానున్నారు.
నిజామాబాద్ లోనూ...
మరొకవైపు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని నిజామాబాద్ కార్పొరేషన్ లో బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఎక్కువ డివిజన్లలో కమలం పార్టీకి చెందిన అభ్యర్థులే గెలుస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ధర్మపురి అరవింద్ రెండుసార్లు గెలవడంతో పాటు అక్కడ బీజేపీ పట్టు బిగించే దిశగా అడుగులు వేస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయి ఫలితాలు వెలువడలేదు. దీంతో చివరి నిమిషంలో నిజామాబాద్ కార్పొరేషన్ మేయర్ పదవి ఎవరికి దక్కనుందన్నది తేలకుండా ఉంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎంల మధ్య పోటీ ఉంది. బీఆర్ఎస్ నామమాత్రంగానే మారడంతో ఎవరు మేయర్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.




Tags:    

Similar News