Telangana : విహారి ట్రావెల్స్ బస్సు మంటల్లో
తెలంగాణలో మరొక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దహనమయింది
ప్రయివేటు ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణం నరకానికి దారులుగా మారుతున్నాయి. తెలంగాణలో మరొక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు దహనమయింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. విహారీ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళుతుండగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ప్రయాణికులు సురక్షితం...
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో అక్కడ ట్రాఫిక్ చాలా సేపు నిలిచిపోయింది. అయితే బస్సుకు మంటలు అంటుకున్న వెంటనే ప్రయాణికులు కిటికీ అద్దాలు పగుల కొట్టుకుని కిందకు దిగారు. దీంతో ఎవరూ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోలేదు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. బస్సు పూర్తిగా దగ్దమైంది. ప్రమాదం సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.