India Vs Newzealand Champions Trophy : నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్.. సూపర్ సండే

నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య సూపర్ మ్యాచ్ జరగనుంది.

Update: 2025-03-02 04:28 GMT

నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య సూపర్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే భారత్ వరసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఊపు మీదుండగా, అదే రేంజ్ లో కివీస్ కూడా ఉంది. పైగా ఇటీవల ఇండియాలో జరిగిన టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ స్వీప్ చేసేసింది. న్యూజిలాండ్ జట్టు మేటి జట్టుగా తయారైంది. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్టులను మట్టికరిపించింది. ఆ జట్టు బ్యాటర్లను తట్టుకోవడం అంత సులువు కాదు. ఒకరు కాకుంటే మరొకరు అన్నట్లుగా సెంచరీలు మీద సెంచరీలు చేసి తమ జట్టుకు విజయం సాధించిపెట్టగల సత్తా ఉన్నోళ్లు. మరొక వైపు భారత్ బ్యాటర్లు కూడా దూకుడు మీదున్నారు. సీనియర్ ఆటగాళ్లు ఫామ్ లోకి రావడంతో పరుగుల వరద పారవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

ఎవరు గెలిచినా.. ఓడినా...?
అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా సెమీ ఫైనల్స్ కు వెళ్లడం ఖాయం. అందుకే ఎవరూ పెద్దగా భయపడకుండానే బరిలోకి దిగనున్నాయి. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కావడంతో ఖచ్చితంగా ఇరు జట్లు గెలుపు కోసం చెమటోడుస్తాయి. రన్ రేట్ భారత్ కంటే ఎక్కువగా న్యూజిలాండ్ కే ఉంది. ఆదివారం మ్యాచ్ జరుగుతుండటంతో ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగేనని చెప్పాలి. గణాంకాలు చూస్తే భారత్ - న్యూజిలాండ్ జట్లు ఇప్పటి వరకూ 118 మ్యాచ్ లలో తలపడ్డాయి. అందులో భారత్ 60 మ్యాచ్ లలో విజయం సాధించింది. న్యూజిలాండ్ యాభై మ్యాచ్ లలో గెలిచింది. ఏడు మ్యాచ్ లు రద్దు కాగా, ఒక మ్యాచ్ టై గా ముగిసింది. ఈ లెక్కలు చాలదూ రెండు జట్లు ఎంత బలంగా ఉన్నయో చెప్పటానికి.
ఛాంపియన్స్ ట్రోఫీలో...
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం ఒకే సారి ఈ రెండు జట్లు తలపడగా ఆ మ్యాచ్ ను కివీస్ సొంతం చేసుకుంది. వన్డే ప్రపంచ కప్ చూస్తూ భారత్ - న్యూజిలాండ్ లు పదకొండు సార్లు ఆడగా, చెరో ఐదు మ్యాచ్ లలో గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. అందుకే మనోళ్లకు అంత సులువు కాదు. అంత కష్టమూ కాదన్నది క్రీడా నిపుణుల అభిప్రాయం. న్యూజిలాండ్ జట్టు అతి ప్రమాదకరమైన జట్టు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. భారత్ బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. లేకుంటే కివీస్ చేతిలో పరాభవం చూడాల్సి వస్తుంది. అందుకే నేడు జరిగే మ్యాచ్ భారత్ కు ఎంత ప్రతిష్టాత్మకమో.. కివీస్ కు అంత కష్టమే. అందుకే సమఉజ్జీల పోరాటాన్ని మాత్రం మైదానంలో చూసేందుకు రెండు కళ్లు చాలవన్నది వాస్తవం.


Tags:    

Similar News