T20 World Cup Finals : మరి కాసేపట్లో భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్.. గెలుపు అంచనాలివే
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. భారత్–న్యూజిలాండ్ పోరు చూసేందుకు ఇప్పటికే నగరం ఖాళీ అయింది. ఆదివారం కావడంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. టీవీలు రాత్రి ఏడు గంటల నుంచి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ వేదికగా జరిగే మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ గెలుపోటములపై అనేక రకాలుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు జట్లు వత్తిడి మధ్య మైదానంలోకి అడుగుపెడుతున్నాయి.
బలమైన ప్రదర్శనలు చేసి..
ఈ టోర్నీలో తొలి టైటిల్ కోసం న్యూజిలాండ్ కన్నేసింది. మరోవైపు భారత్ మూడు ప్రత్యేక రికార్డులు సాధించాలనే లక్ష్యంతో ఫైనల్‌కు సిద్ధమవుతోంది. వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలవడం, ఆతిథ్య దేశంగా ట్రోఫీ సాధించిన తొలి జట్టవడం, మొత్తం మూడు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించడం భారత్ లక్ష్యం.సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో భారత్, న్యూజిలాండ్ రెండూ బలమైన ప్రదర్శన చేశాయి. గ్రూప్ దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలైన న్యూజిలాండ్, సూపర్–8లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. అయితే సెమీఫైనల్లో అదే దక్షిణాఫ్రికాను 10 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
సూపర్ ఫామ్ లోనే...
భారత్ గ్రూప్ దశలో అద్భుతంగా ఆడింది. సూపర్–8లో ఒక మ్యాచ్ మాత్రమే కోల్పోయింది. సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌కు స్వల్ప ఆధిక్యం ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వదేశ మద్దతు, బలమైన బ్యాటింగ్ వరుస, వేగం–స్పిన్ కలగలిసిన సమతుల్య బౌలింగ్ దళం జట్టుకు బలంగా ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ జట్టును కూడా తీసిపారేయడానికి వీలులేదు. అది కూడా దక్షిణాఫ్రికాపై విజయం సాధించి మంచి ఊపు మీద ఉంది. ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. అయితే ఈ పిచ్ పరుగులకు అనుకూలం కావడంతో భారీ పరుగులు రాబట్టేందుకు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ప్రయత్నిస్తుంది. అందుకు టాస్ కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.