Asia Cup : రేసు గుర్రంలా భారత్.. కసితో పాక్.. మైదానంలో ఢీ అంటే ఢీ
ఈరోజు ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఈరోజు ఆసియా కప్ లో భారత్ - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో షేక్ హ్యాండ్ వివాదంతో రెండు దేశాల మధ్య అలాగే రెండు జట్ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. షేక హ్యాండ్ వివాదం ఇంకా సమసి పోకముందే నేడు మరోసారి రెండు జట్లు తలపడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో భారత్ హాట్ ఫేవరెట్ గా దిగబోతుంది. గ్రుప్ ఎ లో ఇప్పటి వరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో భారత్ గెలిచి సూపర్ 4లో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ రెండు మ్యాచ్ లలో గెలిచి భారత్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలయింది. ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన పాకిస్తాన్ జట్టు తేరుకుని తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతుందని ఆ జట్టు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అవమాన భారంతో...
అయితే ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా తమ తప్పులను తెలుసుకునేందుకు అవకాశం దక్కింది. ఒమన్ లో చెమటోడ్చి గెలవడంతో పాకిస్తాన్ రెట్టించిన ఉత్సాహంతో మైదానంలోకి అడుగు పెట్టే అవకాశముంది. శనివారం మైదానంలో ప్రాక్టీస్ లో కనిపించిన ఆ జట్టు ఈసారి ఖచ్చితంగా భారత్ ను ఓడించాలన్న కసితో ఉన్నట్లు కనిపించింది. షేక్ హ్యాండ్ వివాదంతో అవమాన భారంతో కుంగిపోయిన పాకిస్తాన్ జట్టు ఎలాగైనా గెలిచి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఉంది. కానీ పాకిస్తాన్ జట్టును చూస్తే బ్యాటింగ్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. భారత్ పై గెలవడం అంత ఆషామాషీ కాదని దానికి తెలుసు. అయినా సరే చివర వరకూ తన ప్రయత్నాన్ని కొనసాగించనుంది.
మార్పులుండకపోవచ్చంటూ...
అలాగే భారత్ కూడా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో జట్టులో మార్పులు చేపట్టింది. అయితే పాకిస్తాన్ తో ఈరోజు జరిగే మ్యాచ్ లో జట్టులో మార్పులు ఉండే అవకాశం ఉండకపోవచ్చంటున్నారు. అక్షర్ పటేల్ ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడినా కోలుకుని తిరిగి నేడు జరిగే మ్యాచ్ లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్షర్ పటేల్ కేవలం బౌలింగ్ మాత్రమే కాకుండా, బ్యాటింగ్ కు దిగినా టీం ఇండియాకు ప్లస్ అవుతాడు. ఆల్ రౌండర్ గా జడేజా లేని లోటు కనిపించడం లేదు. అందుకే గత ఆదివారం ఆడిన జట్టునే ఈరోజు కూడా కొనసాగిండం బెస్ట్ అన్న కామెంట్స్ క్రీడానిపుణుల నుంచి వెలువడుతున్నాయి. అయితే మొన్నటి షేక్ హ్యాండ్ వివాదంతో ఈ మ్యాచ్ మరింత ఉద్విగ్నభరితంగాసాగే అవకాశముందని మాత్రం చెప్పాలి. కానీ గెలుపు ఎవరిదన్నది.. ఈరోజు గ్రౌండ్ లో ఎవరిది పై చేయి అన్నది.. తేలాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.