Surya Kumar Yadav : మైదానంలో సుడిగాలులు రేపిన స్కై....చెలరేగితే ఇలాగే ఉంటుంది భయ్యా

నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ చూసిన వాళ్లు... ఎవరైనా సూర్యకుమార్ యాదవ్ ను ప్రశంసించకుండా ఉండలేరు

Update: 2023-12-15 03:45 GMT

suryakumar yadav

నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ చూసిన వాళ్లు... ఎవరైనా సూర్యకుమార్ యాదవ్ ను ప్రశంసించకుండా ఉండలేరు. ఏమి షాట్లు.. ఏమి మెరుపులు.. కళ్లు రెండు చాలవు. ఒకటా.. రెండా... ఏడు ఫోర్లు.. ఎనిమిది సిక్సర్లు.. దంచి పారేశాడు.. సూర్య చెలరేగిపోతే ఎలా ఉంటుందో దక్షిణాఫ్రికా బౌలర్లకు రుచి చూపించాడు. మైదానం నలు వైపులా బంతిని బాదుతూ తనదైన స్టయిల్ లో స్కై వీరవిహారం చేస్తుంటే స్టేడియంలో ఉన్న భారతీయులే కాదు.. టీవీని చూస్తున్న ఇండియన్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ వచ్చాయంటే అతిశయోక్తి కాదేమో.

ఆడాల్సిన సమయంలో...
తొలి రెండు వికెట్లు పడగానే మనోళ్లు అంతేనని, ఈ మ్యాచ్ కూడా పోతుందని బాధపడిన వారికి సూర్యకుమార్ యాదవ్ బామ్ రాసేశాడు. గేమ్ ను మన వైపు తిప్పేశాడు. వంద పరుగులు టీ 20 లలో చేయడం అంటే ఆషామాషీ కాదు. అందుకు తగిన సమర్థత కావాలి. సన్నద్ధత కావాలి. స్టామినా కావాలి. అవన్నీ పుష్కలంగా ఉన్న సూర్యకుమార్ యాదవ్ తానేంటో మరోసారి చూపించాడు అందరికీ. టీ 20లో స్కైకి ఎదురులేదని మరోసారి నిరూపించాడు. అందుకే స్కై కొన్ని సార్లు విఫలమయినా పెద్దగా విమర్శలు ఉండవు. ఆడాల్సిన సమయంలో ఆడేసి అవతల వారి నుంచి మ్యాచ్ ను లాగేసుకోవడం సూర్య స్పెషాలిటీ.
అన్ని రికార్డులను...
మిస్టర్ 360 అంటే మామూలు కాదు. సూర్య షాట్లను వర్ణించడానికి అక్షరాలు కూడా సరిపోవు. అలా ఆడాడు మనోడు నిన్న. విరుచుకుపడటం అంటే ఇదేనేమో. సూర్య తుఫాన్ సృష్టించాడు. బంతితో మైదానంలో సుడిగాలులు రేపాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో సూర్యకుమార్ యాదవ్ టీ20లలో టీం ఇండియా తరుపున అత్యధిక సెంచరీలు చేసిన రోహిత్ శర్మ సరసన చేరాడు. మొత్తం నాలుగు సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్ అతి తక్కువ మ్యాచ్‌లలో సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా రికార్డులకు ఎక్కాడు. మ్యాక్స్‌వెల్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు. మ్యాక్స్ వెల్ 92 మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు చేయగా, మన స్కూ 57 ఇన్నింగ్స్ లోనే నాలుగు సెంచరీలను బాదేశాడు. అలా రికార్డుల రారాజుగా నిలిచాడు.


Tags:    

Similar News