India Vs South Afrcia : ధర్మశాల నీదా? నాదా? గెలుపు కోసం భారత్ - దక్షిణాఫ్రికా
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య నేడు మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. రాత్రి ఏడు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరిగాయి. కటక్ లో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ముల్తాన్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం సిరీస్ లో 1-1 గా ఇరు జట్లు సమంగా ఉన్నాయి. దీంతో ధర్మశాలలో జరిగే మ్యాచ్ లో గెలిచి సిరీస్ పై పై చేయి సాధించాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్వల్ప మార్పులతో భారత్ జట్టు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓపెనర్లు బలహీనంగా...
ధర్మశాలలో జరిగే మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగే అవకాశముంది. ఇరు జట్లు బలంగానే ఉన్నాయి. భారత్ ఓపెనర్లు బలహీనంగా కనిపిస్తున్నారు. టాప్ ఆర్డర్ మొత్తం గత రెండు మ్యాచ్ లలో వైఫల్యం పొందింది. టాప్ ఆర్డర్ బలంగా లేకుంటే మిగిలిన ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. అదే ఛేజింగ్ సమయంలో మరింత ఒత్తిడికి గురవుతారు. శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లు వైఫల్యం భారత్ జట్టును కంగారు పెడుతుంది. హార్థిక్ పాండ్యా, తిలక్ వర్మ పరవాలేదనిపిస్తున్నారు.
బ్యాటింగ్ బలోపేతం చేయడానికి...
ఇక ధర్మశాలలో జరిగే మ్యాచ్ లో సంజూ శాంసన్ ను తీసుకోవాలని కోరుతున్నారు. జితేష్ శర్మ స్థానంలో సంజూ శాంసన్ ను తీసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడుతుందని అంటున్నారు. బౌలింగ్ లోనూ మరింత రాటు దేలాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైడ్స్ ఎక్కువగా వేయడంతో పాటు వికెట్లను వీలయినంత త్వరగా దొరకబుచ్చుకుంటేనే ప్రత్యర్థి ఆటను కట్టేయడానికి వీలవుతుంది. జస్ప్రిత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్ధిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు మరింతగా పదునైన బంతులు విసిరి దక్షిణాఫ్రికాను కట్టడి చేయాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా కూడా రెండో మ్యాచ్ విజయంతో మంచి ఊపు మీద ఉండటంతో ధర్మశాల లో ఎవరికి విజయం అన్నది చూడాల్సి ఉంది.