Ind vs Eng Third Test : లార్డ్స్ లో రేపటి నుంచి ఇండియా - ఇంగ్లండ్ మూడో టెస్ట్

ఇండియా - ఇంగ్లండ్ మూడో టెస్ట్ లార్డ్స్ లో రేపటి నుంచి ప్రారంభం కానుంది.

Update: 2025-07-09 01:40 GMT

ఇండియా - ఇంగ్లండ్ మూడో టెస్ట్ లార్డ్స్ లో రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లీడ్స్ లో జరిగిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసినప్పటికీ స్వీయ తప్పిదాల కారణంగా ఓటమిని కొని తెచ్చుకున్నారు. ఇక బర్మింగ్ హామ్ లో జరిగిన రెండో టెస్ట్ లో మాత్రం ఆ తప్పులను సరిదిద్దుకుని ముందుకు వెళ్లడంతో భారీ విజయం లభించింది. ఇప్పుడు ఐదు టెస్ట్ ల సిరీస్ లో 1-1 స్కోరు సమంగా ఉంది. అందుకే రేపటి నుంచి లార్డ్స్ లో జరిగే టెస్ట్ మ్యాచ్ లో గెలుపు ఎవరిదన్న దానిపై అంచనాలు ఇప్పటి నుంచే ఊపందుకున్నాయి. లార్డ్స్ మైదానం పేసర్లకు అనుకూలంగా ఉండటంతో మనోళ్లు గట్టిగా జవాబు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంగ్లండ్ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు.

గెలుపు కోసం ఇంగ్లండ్...
సొంత మైదానం కావడం ఇప్పటికే ఒక మ్యాచ్ లో ఓడి పోవడంతో ఆధిపత్యం కోసం ఖచ్చితంగా ఇంగ్లండ్ జట్టు గెలుపు కోసం శ్రమిస్తుంది. అయితే లార్డ్స్ లో దిగే భారత్ జట్టులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలున్నాయని అంటున్నారు. గెలిచి ఊపు మీదున్న భారత్ జట్టులో బ్యాటింగ్ పరంగా కాకున్నా బౌలింగ్ పరంగా కొన్ని మార్పులు చేసే అవకాశముందని చెబుతున్నాు. రెండో టెస్ట్ లో బూమ్రా లేకపోవడంతో అతని స్థానంలో వచ్చిన ఆకాశ్ దీప్ పది వికెట్లు అందిపుచ్చుకుని విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మూడో టెస్ట్ లోనూ ఆకాశ్ దీప్ కొనసాగే అవకాశముంది. ఇక బూమ్రా కూడా వస్తే ప్రసిద్ధ కృష్ణను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. సిరాజ్ ను ఉంచి ప్రసిద్ధ కృష్ణను తప్పించవచ్చని అంటున్నారు.
మార్పులతో...
ప్రసిద్ధ్ కృష్ణ రెండు టెస్ట్ లలో పెద్దగా రాణించకపోవడంతో మూడో టెస్ట్ లో అతనిని పక్కన పెట్టి సిరాజ్, ఆకాశ్ దీప్, బూమ్రాలతో భారత్ దిగే అవకాశాలున్నాయి. ఇక బ్యాటింగ్ లోనూ కరుణ్ నాయర్ పెద్దగా ప్రదర్శన చేయలేకపోయాడు. రెండు టెస్ట్ లలో విఫలమయ్యాడు. దీంతో అతని స్థానంలో సాయి సుదర్శన్ ను బరిలోకి దించే అవకాశాలున్నాయి. మరొకవైపు నితీష్ కుమార్ రెడ్డి కూడా నిరాశపర్చాడు. దీంతో నితీష్ ను కూడా పక్కనే పెట్టే ఛాన్స్ ఉంది. ఆల్ రౌండర్ గా తీసుకున్నా సరైన ప్రదర్శన చేయకపోవడంతో నితీష్ ను రిజర్వ్ బెంచ్ కే థర్డ్ టెస్ట్ లో పరిమితం చేయవచ్చు. ఇక నాలుగో పేసర్ గా అర్ష్ దీప్ సింగ్ ను ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. మొత్తం మీద రెండో టెస్ట్ లో గెలిచినా లార్డ్స్ లో మాత్రం భారత్ జట్టులో మార్పులు ఉండే అవకాశాలున్నాయి. బ్యాటర్లలో తక్కువగా, బౌలర్లలో ఎక్కువగా మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి.


Tags:    

Similar News