Asia Cup : పాక్ పై గెలిచినా భారత్ లో ఆనందం లేదా? మౌనంగా నిరసన తెలిపారా?
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై స్వదేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆసియాకప్ ఆడకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది
భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై స్వదేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆసియాకప్ ఆడకుండా ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. పహాల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ తో ఒకే వేదికను పంచుకోవడం ఇష్టం లేని అభిమానులు ఈ ఆటను కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అదే సమయంలో నిన్న పాక్ పై భారత్ గెలిచినప్పటికీ కనీసం బాణా సంచా కూడా కాల్చకుండా తమ నిరసనను తెలియజేశారంటే ఏ రేంజ్ లో మ్యాచ్ పై వ్యతిరేకత వ్యక్తమయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పాక్ పై భారత్ గెలిచిన వెంటనే టపాసుల మోతతో భారత్ లోని అనేక ప్రాంతాలు దద్దరిల్లిపోయేవి.
గత కొద్ది రోజులుగా...
కానీ నిన్న జరిగిన మ్యాచ్ లో భారత్ గెలిచినా క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు అనేక మంది భారతీయులు మౌనంగా ఉండి తమ నిరసనను తెలియజేశారు.అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో భారత్ - పాక్ ల మధ్య ఆసియా కప్ లో జరగనున్న మ్యాచ్ పై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఆట కావడంతో పాటు బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో దుబాయ్ కు వెళ్లిన మన జట్టు పాక్ పై గెలిచింది. అయితే ఈ సందర్భంగా పాక్ పై గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ స్టేడియంలోనే పహాల్గాంమ్ దాడులలో మరణించిన వారికి తన సంతాపాన్ని ప్రకటించాడు. అలాగే ఈ విజయాన్ని భారత్ ఆర్మీకి ఇస్తున్నట్లు సూర్యకుమార్ యాదవ్ ప్రకటించాడు.
భారత్ సైన్యానికి అంకితమంటూ...
ఇలా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ పాక్ పై తన నిరసనను తెలియజేశాడు. ఇండియా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని కూడా సూర్యకుమార్ వ్యాఖ్యానించాడు. కనీసం పాక్ ఆటగాళ్లతో మైదానంలో కరచాలనం చేయడానికి కూడా భారత్ ఆటగాళ్లు సిద్ధపడలేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చానని సూర్యకుమార్ యాదవ్ చెప్పడంతో దుబాయ్ లోని స్టేడియం చప్పట్లతో మారుమోగింది. మ్యాచ్ గెలిచినా, సూర్యకుమార్ యాదవ్ తన అభిప్రాయాన్ని దుబాయ్ వేదికగా పాక్ పై కుండ బద్దలు కొట్టినప్పటికీ భారత్ లో మాత్రం క్రికెట్ అభిమానులు ఈ విజయాన్ని ఆస్వాదించలేదు. దానికి ఉదాహరణ టపాసులు కాల్చి తమ అభిమానాన్ని చెప్పకపోవడమేనంటున్నారు.