India Vs England Fourth Test : ఇంగ్లండ్ గడ్డ మీద సిరీస్ నేర్పిన పాఠాలేంటంటే?

మాంచెస్టర్ లో జరిగే భారత్ - ఇంగ్లండ్ నాల్గో టెస్ట్ మ్యాచ్ కు ఇంకా ఐదు రోజుల మాత్రమే సమయం ఉంది.

Update: 2025-07-18 02:03 GMT

భారత్ - ఇంగ్లండ్ నాల్గో టెస్ట్ మ్యాచ్ కు ఇంకా ఐదు రోజుల మాత్రమే సమయం ఉంది. మాంచెస్టర్ లో జరిగే ఈ మ్యాచ్ సందర్భంగా అనేక విషయాలను మాజీ క్రికెటర్లు ప్రస్తావిస్తున్నారు. తొలి టెస్ట్ ను చేజేతులా చేజార్చుకోవడం, మూడో మ్యాచ్ కూడా చేతికి అందినట్లే అంది దక్కకుండా పోవడంపై అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. నిజానికి ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్ లు భారత్ సొంతం కావాల్సి ఉంది. భారత్ చేజేతులా రెండు మ్యాచ్ లు సమర్పించుకోవడానికి కారణం అనుభవ రాహిత్యమేనని అంటున్నారు. చేతికి చిక్కిన మ్యాచ్ చేజారిపోతున్నా ఏమీ చేయలేని నిస్సహాయతతో ఉన్నారంటే అది ఆటగాళ్ల తప్పు కాదని, అనుభవ లేమి అన్న విశ్లేషణలు బలంగా నిపిస్తున్నాయి.

తొలి టెస్ల్ అందినట్లే అంది...
తొలి టెస్ట్ లో భారత్ బ్యాటర్లు భారీ పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచారు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్ లో ఐదు సెంచరీలు చేశారు. అయినా సరే భారత్ బౌలర్లు ఇంగ్లండ్ బౌలర్లను కట్టడి చేయలేకపోవడం, చెత్త ఫీల్డింగ్ కారణంగా ఇంగ్లండ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో ఐదు వికెట్లు కోల్పోయి 371 పరుగుల లక్ష్యాన్ని ఛేధించింది. అంటే ఇక్కడ బ్యాటర్లు బాగా ఆడినా, బౌలర్లు విఫలమయ్యారు. మరొక వైపు ఫీల్డింగ్ లో కూడా తడబాటు కనిపించింది. తొలి టెస్ట్ లో ఓడిపోయినా రెండో టెస్ట్ లో గెలవడంతో మూడవ టెస్ట్ మ్యాచ్ ను కనీసం డ్రా గానైనా, లేకుంటే గెలిచి తీరతారని భావించినా తక్కువ పరుగులకే సమర్పించుకోవాల్సి వచ్చింది.
తక్కువ పరుగులతేడాతో...
ఇండియా - ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో భారత్ కు పరాజయం దక్కింది. చేతిలోకి వచ్చిన మ్యాచ్ చేజారి పోయింది. అందినట్లే అంది.. ఊరించినట్లే ఊరించి చివరకు తక్కువ పరుగులతో టీం ఇండియా ఓటమి పాలయింది. భారత్ బ్యాటర్ల వైఫల్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కనీసం ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లు నిలకడగా ఆడినా మ్యాచ్ డ్రా అయ్యేది. కానీ డ్రా మాట సంగతి దేవుడెరుగు అసలు పిచ్ పై నిలబడటమే కష్టమయిపోయింది భారత్ బ్యాటర్లకు. జడేజాకు కనీసం జోడీగా నిలిచే వారే లేకపోయారు. చివరిరోజు ఆట మన వైపు ఉన్నా అందిపుచ్చుకోలేక అవస్థలు పడి మ్యాచ్ ను అప్పగించేశారు. కేవలం ఇరవై రెండు పరుగుల తేడాతోనే ఓటమి పాలయింది. అందుకు కారణం అనుభవలేమి అని అంటున్నారు.
పునరాలోచించుకోవాలంటూ...
దీంతో సీనియర్లు అవసరం అన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. ప్రధానంగా విరాట్ కోహ్లి వంటి సీనియర్ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పిటికీ నిర్ణయంపై పునరాలోచించుకోవాలని మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. రిటైర్మెంట్ పై వెనక్కు తగ్గి తిరిగి టెస్ట్ క్రికెట్ లోకి రావాలని సీనియర్ ఆటగాడు మదన్ లాల్ కోరారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లు టెస్ట్ క్రికెట్ లో కొంతకాలం ఆడితే బాగుంటుందని ఒక టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒత్తిడిని తట్టుకోవడంలోనూ, నిలకడగా ఆడేందుకు సీనియారిటీ ఖచ్చితంగా దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయం సోషల్ మీడియాలో కూడా వ్యక్తమవుతుండటంతో పెద్దోళ్లూ.. మళ్లీ ఆలోచించుకోరూ.. అన్న కామెంట్స్ కనపడుతున్నాయి.


Tags:    

Similar News