India vs Pakisthan Champion Trophy : రిలాక్స్.. రిలాక్స్.. ట్రాక్ రికార్డు చూసిన వారు ఎవరైనా ఇలాగే చెబుతారుగా?
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు
భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కు మరికొద్ది గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఎన్నడూ లేనంత టెన్షన్ ఈ రోజు జరిగే మ్యాచ్ లోనే ఉంది. ఎందుకంటే భారత ఆటగాళ్లపై పెద్దగా నమ్మకం లేకపోవడమే కారణం. అయితే రిలాక్స్ గా ఉండొచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ఐసీసీ నిర్వహించే టోర్నీలో భారత్ ట్రాక్ రికార్డు బలంగా ఉంది. ఐసీసీ టోర్నీలలో భారత్ - పాక్ ఇప్పటి వరకూ ఇరవై ఒక్క సార్లు పోటీ పడితే భారత్ పదహారు సార్లు విజయం సాధించింది. పాకిస్థాన్ కేవలం ఐదు సార్లు మాత్రమే విజయం సాధించింది. ఈ గణాంకాలు చాలదూ మనం రిలాక్స్ అవ్వడానికి అంటున్నారు క్రీడా నిపుణులు.
బలమైన బ్యాటింగ్ లైనప్...
భారత్ బ్యాటింగ్ బలంగా ఉంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా అందరూ బ్యాటర్లే. వీరిలో కొందరు బౌలర్లయినా ఆల్ రౌండర్లుగా పేరుంది. జట్టు క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు విజయతీరాలకు చేర్చిన చరిత్ర కూడా వీరికి ఉంది. దాపాపు ఎనిమిది మంది వరకూ మంచి బ్యాటర్లు ఉండటం కంటే అంతకు మించిన బలం భారత్ కు మరేముంటుంది? అని అంటున్నారు. ఇక బౌలింగ్ లోనూ షమి అనుభవం ఉపయోగపడుతుంది. హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్ లలో ఎవరైనా వికెట్ కరెక్ట్ టైంలో తీయగలరు. హార్ధిక్ పాండ్యా కూడా జట్టుకు బలమైన బౌలర్ గా ఉన్నాడు. ఇక స్పిన్నర్ల గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. కులదీప్ స్థానంలో వరుణ్ చక్రవర్తిని తీసుకుంటారంటున్నారు.
అదే తేడా...
అదే జరిగితే వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తన స్పిన్ మాయాజాలంతో పాక్ బ్యాటర్లను కట్టడి చేయడమే కాదు.. త్వరత్వరగా పెవిలియన్ కు పంపేస్తారు. ఇక జడేజా ఉండనే ఉన్నారు. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ లోనూ జట్టును అనేక సందర్భాల్లో ఆదుకున్నాడు. ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ పై గెలిచి మంచి జోష్ లో ఉంది. పాకిస్థాన్ మాత్రం న్యూజిలాండ్ పై ఓటమి పాలయి సొంత గడ్డపై ట్రోలింగ్ ను ఎదుర్కొంటోంది. కెప్టెన్ దెబ్బకు టీం లో విభేదాలు బయటపడటం కూడా పాక్ జట్టులో కనిపిస్తున్న లోపాలు. ఇలా ఎటు చూసుకున్నా ఈ మ్యాచ్ లో భారత్ విజయం ఖాయమన్న లెక్కలు కనపడుతున్నాయి. అయినా ఇది క్రికెట్ కాబట్టి.. ఏదైనా జరిగే అవకాశముంది కాబట్టి రిలాక్స్ గా ఉంటే భారత్ కు విజయం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.